BSE: బ్లాక్ ఫ్రైడే... నిమిషాల వ్యవధిలో 1000 పాయింట్లకు పైగా పతనమైన సెన్సెక్స్!

  • మార్కెట్ ను వీడని కరోనా భయాలు
  • ప్రపంచ జీడీపీ తగ్గుతుందన్న వార్తలతో నశించిన సెంటిమెంట్
  • 3 శాతం నష్టాల్లో స్టాక్ మార్కెట్
Huge Early Loss for Stock Market

భారత స్టాక్ మార్కెట్లో మరో బ్లాక్ ఫ్రైడే నమోదైంది. నిమిషాల వ్యవధిలోనే లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సంపద హారతి కర్పూరమైంది. కరోనా భయాలు ప్రపంచ జీడీపీని కుదేలు చేయనున్నాయని వచ్చిన వార్తలకు తోడు, మరిన్ని దేశాలకు వైరస్ వ్యాపించిందన్న వార్తలు, ఆసియా మార్కెట్లను కుదేలు చేయగా, భారత ఇన్వెస్టర్ల సెంటిమెంట్ నశించింది. దీంతో సెషన్ ఆరంభంలోనే బెంచ్ మార్క్ సూచికలు భారీగా నష్టపోయాయి.

బడ్జెట్ సెషన్ నాటి ట్రేడింగ్ సరళిని గుర్తు చేస్తూ, ఈ ఉదయం మార్కెట్ ప్రారంభమైన నిమిషాల్లోనే సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. అన్ని సెక్టోరల్ ఇండెక్స్ ల్లోని కంపెనీల ఈక్విటీలను విక్రయించేందుకే ఇన్వెస్టర్లు మొగ్గు చూపారు. ఈ ఉదయం 10.20 గంటల సమయంలో బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక సెన్సెక్స్ 1104 పాయింట్లు పడిపోయి 38,641 పాయింట్లకు చేరింది. క్రితం ముగింపుతో పోలిస్తే ఇది 2.80 శాతం నష్టం.

ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ, 347 పాయింట్లు పడిపోయి 3 శాతం నష్టంతో 11,285 పాయింట్లకు పడిపోయింది. టాటా మోటార్స్, టాటా స్టీల్, వీఈడీఎల్, జేఎస్ డబ్ల్యూ స్టీల్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ తదితర నిఫ్టీ-50లోని అన్ని కంపెనీలూ నష్టాల బాటలోనే నడుస్తున్నాయి.

ఆసియా మార్కెట్లను పరిశీలిస్తే, నిక్కీ 4.13 శాతం, స్ట్రెయిట్స్ టైమ్స్ 2.54 శాతం, హాంగ్ సెంగ్ 2.50 శాతం, తైవాన్ వెయిటెన్డ్ 1.24 శాతం, కోస్పీ 3.05 శాతం, సెట్ కాంపోజిట్ 3.15 శాతం, జకార్తా కాంపోజిట్ 4.04 శాతం, షాంగై కాంపోజిట్ 3.37 శాతం నష్టాల్లో ఉన్నాయి.

  • Loading...

More Telugu News