Guntur District: ప్రియురాలి మోజులో దారితప్పిన యువకుడు!

lover enter in to the college as raw agent
  • ‘రా’ ఏజెంట్‌ను అంటూ కళాశాలలోకి ప్రవేశం
  • అనుమానం వచ్చి నిర్బంధించిన సిబ్బంది
  • పోలీసులకు అప్పగించడంతో అసలు విషయం వెలుగులోకి

ప్రియురాలి మోజులో ఉన్న ఓ యువకుడు ప్రేమ కోసం తప్పటడుగు వేసి జైలు పాలయ్యాడు. ప్రియురాలు  చదువుతున్న కళాశాలకు వెళ్లి తాను రీసెర్చి అండ్‌ అనాలిసిస్‌ వింగ్‌ (రా) ఏజెంట్‌ని అంటూ బిల్డప్‌ ఇవ్వడంతో అక్కడ అడ్డంగా బుక్కయిపోయాడు. పోలీసుల కథనం మేరకు...గుంటూరు జిల్లా ముస్తాఫానగర్‌కు చెందిన ఉదయ్‌కిరణ్‌ సీఏ చదువుతున్నాడు. ఖమ్మం జిల్లా వైరా ఇంజనీరింగ్‌ కళాశాలకు చెందిన ఓ యువతితో ప్రేమలో పడ్డానని చెబుతున్నాడు.

సదరు యువతితో మాట్లాడేందుకు ఉదయ్‌కిరణ్‌ ఏకంగా ‘రా’ ఏజెంట్‌ అవతారం ఎత్తాడు. కళాశాలకు వెళ్లి తాను ‘రా’ ఏజెంట్‌నని ప్రిన్సిపాల్‌కి పరిచయం చేసుకున్నాడు. ఓ యువతి పేరు చెప్పి ఆమెను విచారించాల్సిన అవసరం ఉందని, ఆమెను తన వద్దకు పంపాలని కోరాడు. అయితే ఉదయ్‌కిరణ్‌ ప్రవర్తనపై అనుమానం వచ్చిన ప్రిన్సిపాల్‌, సిబ్బంది అతన్ని నిర్బంధించి పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, ‘నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆమెతో ఏకాంతంగా మాట్లాడేందుకే ఈ ఎత్తుగడ వేశాను’ అంటూ చెప్పడంతో పోలీసులే ఆశ్చర్యపోయారు. బంగారం లాంటి భవిష్యత్తును ఇటువంటి తప్పిదాలతో యువత పాడుచేసుకుంటున్నారని పోలీసులు విచారం వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News