Corona Virus: దక్షిణకొరియాపై కరోనా పంజా.. ఒక్క రోజులోనే వందలాది కేసుల నమోదు.. మూతపడుతున్న కంపెనీలు! 

Coronavirus outbreak spreads in South Korea
  • ఇప్పటి వరకు 1,261 కరోనా కేసుల నమోదు
  • ఒక్క రోజులోనే 300 కొత్త కేసుల నమోదు
  • ప్లాంట్లను మూసేస్తున్న పలు అగ్రశ్రేణి కంపెనీలు

ఇప్పటి వరకు చైనాను బెంబేలెత్తించిన కరోనా వైరస్.. ఇప్పుడు దక్షిణకొరియాపై పంజా విసురుతోంది. ఒక్క రోజులోనే ఆ దేశంలో కరోనా కేసులు ఏకంగా 300 పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దక్షిణకొరియాలో ఇప్పటి వరకు 1,261 కరోనా కేసులు నమోదయ్యాయి. చైనా వెలుపల అత్యధిక స్థాయిలో కరోనా కేసులు దక్షిణకొరియాలోనే నమోదు కావడం గమనార్హం. మరోవైపు, కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న డ్యూగూ నగరంలో హైఅలర్ట్ ప్రకటించారు. పెద్ద ఎత్తున మందులు, రక్షణ పరికరాలను సరఫరా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో దక్షిణకొరియా ప్రధాని చుంగ్ సె క్యున్ మాట్లాడుతూ, కరోనా వైరస్ పై పోరాటంలో ఈ వారం అత్యంత కీలకమైనదని చెప్పారు.

వైరస్ నేపథ్యంలో దక్షిణకొరియాలో పలు అగ్రశ్రేణి సంస్థలు మూతపడుతున్నాయి. ఒక ఉద్యోగికి వైరస్ సోకడంలో శాంసంగ్ కంపెనీ యూనిట్ ను మూసేసింది. చిప్ తయారీ సంస్థ ఎస్కే హైనిక్స్ 800 మందిని ఐసొలేషన్ లో ఉంచింది. పొహాంగ్ లో ఉన్న ప్లాంట్ ను హ్యుందాయ్, ఇంచియోన్ లో ఉన్న ఆర్ అండ్ డీ కేంద్రాన్ని ఎల్జీ సంస్థలు తాత్కాలికంగా మూసేశాయి. దక్షిణకొరియాలో ఉన్న ఒక అమెరికన్ సైనికుడు కూడా వైరస్ బారిన పడ్డాడు. 18 మంది కొరియా సైనికులకు కూడా వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో దక్షిణకొరియా చిగురుటాకులా వణుకుతోంది. మరోవైపు, అత్యవసరమైన పనులు ఉంటే తప్ప ఇరాన్, ఇటలీ, దక్షిణకొరియాకు వెళ్లొద్దని భారత పౌరులకు కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News