Pawan Kalyan: చిత్తశుద్ధి ఉంటే వివాద రహిత భూములనే ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలి: పవన్ కల్యాణ్

Pawan suggests government over land distribution
  • పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఏపీ ప్రభుత్వం సంసిద్ధత
  • రాజధాని భూములను ఎలా ఇస్తారంటూ ప్రశ్నించిన పవన్
  • ఇది ప్రజల మధ్య చిచ్చుపెట్టడమేనంటూ వ్యాఖ్యలు
ఏపీ ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్న నేపథ్యంలో, జనసేనాని పవన్ కల్యాణ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. వివాదాలకు తావులేని భూములనే ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని సూచించారు. నిర్దిష్ట అవసరాల కోసం సమీకరించిన భూములను ఇతర అవసరాలకు కేటాయిస్తే వివాదాలు రేగే అవకాశముందని తెలిపారు. రాజధాని నిర్మాణం కోసం సమీకరించిన భూములను ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేయడాన్ని పవన్ తప్పుబట్టారు.

ఇల్లు లేని పేదలకు ఇళ్ల స్థలం ఇస్తామంటే ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేయరని, చిత్తశుద్ధి ఉంటే పేదలకు వివాద రహిత భూములనే పంపిణీ చేయాలని హితవు పలికారు. భూములు ఇచ్చిన రైతులు ఓవైపు ఉద్యమాలు చేస్తుంటే, మరోవైపు ప్రభుత్వం పేదలకు పట్టాలు ఇచ్చేందుకు ప్రయత్నాలు చేయడం ప్రజల మధ్య చిచ్చుపెట్టడమేనని ఆరోపించారు. రాజధాని భూములను లబ్దిదారులకు ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం భావిస్తోందని, కానీ ఆ తర్వాత చట్టపరమైన చిక్కులు వస్తే బాధపడేది పేదవాళ్లేనని అభిప్రాయపడ్డారు.
Pawan Kalyan
Lands
Poor
Amaravati
Farmers
YSRCP

More Telugu News