Jammu And Kashmir: జమ్మూ కశ్మీర్​లో కొత్త రాజకీయ పార్టీ

  • కాంగ్రెస్ నేత ఉస్మాన్ మజీద్ వేరు కుంపటి
  • త్వరలోనే పార్టీకి రాజీనామా చేయనున్న నేత
  • ఇతరులతో కలిసి పార్టీ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన
New Political Party To Be Formed In Jammu and kashmir

జమ్మూ కశ్మీర్లో  కాంగ్రెస్ పార్టీకి షాక్ తగలనుంది. ఆ పార్టీ అసంతృప్త నాయకుడు ఉస్మాన్ మజీద్ వేరు కుంపటి పెట్టబోతున్నారు. త్వరలోనే కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కాబోయే కొత్త పార్టీలో చేరబోతున్నారు. ఈ విషయాన్ని మజీద్ దాదాపు ధ్రువీకరించారు. కాశ్మీర్‌‌లో కొత్త పార్టీ ఏర్పాటు కాబోతుందని ప్రకటించారు.

ఇటీవల రాష్ట్ర పర్యటనకు వచ్చిన యూరోపియన్ యూనియన్ పార్లమెంటరీ సభ్యులను తమ అనుమతి లేకుండా కలిసిందుకు మజీద్‌కు కాంగ్రెస్ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న మజీద్ జాతీయ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. ఉత్తర కశ్మీర్ లోని బాండిపొరాలో కార్మికులతో కలిసి సమావేశం ఏర్పాటు చేసిన ఆయన.. గత 70 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన నిర్వాకం వల్లే కశ్మీర్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని దుయ్యబట్టారు. ఏకాభిప్రాయం ఉన్న నేతలతో కలిసి కొత్త పార్టీ ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తున్నామని తెలిపారు.

కొత్త పార్తీకి బీజేపీ సాయం చేయడం లేదు

రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు కానున్న పార్టీకి బీజేపీ సహకారం అందిస్తోందన్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని ఉస్మాన్‌ మజీద్ స్పష్టం చేశారు. ఒకే రకమైన ఆలోచన ఉన్న నేతలందరితో తాము టచ్ లో ఉన్నామన్నారు. ప్రజల ఇబ్బందులు పరిష్కరించేందుకు తామంతా ఒక్కతాటిపైకి వస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య శూన్యత ఏర్పడిందన్నారు. రాజకీయ ప్రతినిధులు మాత్రమే దాన్ని పూడ్చగలరని చెప్పారు.

అలాగే, కశ్మీర్ లో స్వీయ పాలన, స్వయం ప్రతిపత్తి విషయంలో నేషనల్ కాన్ఫరెన్స్, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీలు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని ఆరోపించారు. తమ రాష్ట్ర ప్రజలపై కాంగ్రెస్ నాయకత్వానికి చిత్త శుద్ధి లేదన్నారు. వాళ్లు ఢిల్లీలో ఒక భాష, కశ్మీర్ కు రాగానే మరో భాష మాట్లాడుతారని ఉస్మాన్ ఎద్దేవా చేశారు.

More Telugu News