Jagan: నేను ఉన్మాదులతో, రాక్షస మూకలతో యుద్ధం చేస్తున్నాను!: సీఎం జగన్

CM Jagan lashes out media
  • విపరీతమైన రాతలు, విపరీతమైన ప్రసారాలు అంటూ మీడియాపై జగన్ ఆగ్రహం
  • ప్రజలకు మేలు చేస్తుంటే దుష్ప్రచారాలు చేస్తున్నారని మండిపాటు
  • వీళ్లని ఏమనాలి? అంటూ ఆవేశం
ఏపీ సీఎం జగన్ విద్యార్థులకు వసతి దీవెన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తానిప్పుడు యుద్ధం చేస్తున్నది విపక్షాలతో కాదని, ఉన్మాదులు, రాక్షస మూకలతో పోరాడుతున్నానని ఆవేశంగా వ్యాఖ్యానించారు. ఏమీ లేకపోయినా విపరీతమైన రాతలు రాస్తూ, విపరీతమైన అంశాలను ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి చోట మీ బిడ్డకు ఆశీర్వాదాలు కావాలి, దేవుడి వద్ద మీ అందరి ప్రార్థనలు ఉండాలని కోరుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు.

బీసీలకు జనాభా దామాషా పద్ధతిలో స్థానిక సంస్థల్లో సీట్లు పెంచాలని మేం ఆలోచన చేస్తుంటే, అడ్డుకునేందుకు కుట్రలు చేస్తున్నవారిని ఏమనాలంటూ ప్రశ్నించారు. తమ ప్రభుత్వంతో ప్రజలకు మంచి జరుగుతుంటే ఇక బాబు గురించి మాట్లాడుకునేవారు ఎవరూ ఉండరన్న భయంతో దుష్ప్రచారాలు చేస్తున్న పత్రికలు, చానళ్లను ఏమనాలి? అంటూ నిలదీశారు.

వసతి దీవెన పథకం గురించి చెబుతూ, ఇంటర్ విద్య తర్వాత రష్యాలో 81 శాతం మంది విద్యార్థులు పైచదువులకు వెళుతున్నారని, మనదేశంలో ఇంటర్ పూర్తయిన తర్వాత పైచదువుల కోసం వెళుతున్న వారు 23 శాతం మాత్రమేనని ఆవేదన వ్యక్తం చేశారు. 77 శాతం మంది పిల్లలు మధ్యలోనే చదువు ఆపేస్తున్నారని, ఈ పరిస్థితి మారాలనే వసతి దీవెన తీసుకువచ్చామని స్పష్టం చేశారు. డిగ్రీ, పీజీ చదివే విద్యార్థులకు వసతి దీవెన పథకం ద్వారా రెండు విడతలుగా రూ.20 వేలు అందుతాయని, వసతి, భోజనం ఖర్చుల కింద ఈ డబ్బును తల్లులకు అందిస్తామని వెల్లడించారు.
Jagan
Vasathi Deevena
Andhra Pradesh
Students
Media

More Telugu News