SpiceJet: విశాఖకు మరో ఘనత... కార్గో విమాన సేవలకు రక్షణ శాఖ అనుమతి!

  • రోజు విడిచి రోజు సర్వీసులు
  • రెండు విమానాలు నడిపించనున్న స్పైస్ జెట్
  • సరకు రవాణాకు అనుకూలం
Defence Ministry approves Cargo Flight Services from Vizag

విశాఖపట్నం విమానాశ్రయం చరిత్రలో మరో మైలురాయి నమోదు కానుంది. ఎయిర్ పోర్టు నుంచి చెన్నై, కోల్ కతా తదితర ప్రాంతాలకు కార్గో విమానాలను నడుపుకునేందుకు రక్షణ శాఖ అనుమతి ఇచ్చింది. ఇక్కడి నుంచి రవాణా విమానాలు నడిపించేందుకు స్పైస్ జెట్ ముందుకు వచ్చింది. వాస్తవానికి ఈ నెల 15 నుంచే తొలి కార్గో విమానం టేకాఫ్ కావాల్సి వున్నప్పటికీ, రక్షణ శాఖ నుంచి అనుమతులు రావడం ఆలస్యం కావడంతో సర్వీసులు నిలిచిపోయాయి.

స్పైస్ జెట్ కోరిన సమయాలను కార్గో సేవల నిమిత్తం కేటాయించే పరిస్థితి లేదని విశాఖ రక్షణ శాఖ అధికారులు స్పష్టం చేయడంతో ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ సమస్య పరిష్కారానికి కదిలారు. కేంద్ర మంత్రులతో చర్చించారు. విశాఖ నుంచి కార్గో విమానాల అవసరాన్ని గుర్తెరగాలని విన్నవించారు. విశాఖ కార్యనిర్వాహక రాజధానిగా మారనుందని, ఈ సమయంలో సరకు రవాణాకు అవాంతరాలు ఏర్పడకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరడంతో కేంద్ర రక్షణ శాఖ సానుకూలంగా స్పందించింది.

కాగా, ఈ నెల 25 నుంచి చెన్నై - వైజాగ్ - కోల్ కతా, చెన్నై - వైజాగ్ - సూరత్ రూట్లలో కార్గో విమానాలు నడుపుతామని స్పైస్ జెట్ వెల్లడించింది. ప్రస్తుతం రోజు విడిచి రోజు సర్వీసులు నడుస్తాయని, స్పైస్ జెట్ ప్రతినిధి ఒకరు తెలిపారు.

More Telugu News