Vemulawada: మహాశివరాత్రి సందర్భంగా హైదరాబాద్ నుంచి వేములవాడకు హెలికాప్టర్ సర్వీసులు

  • సర్వీసులను ప్రారంభించిన మంత్రి శ్రీనివాస్ గౌడ్
  • మూడు ప్యాకేజీల్లో హెలికాప్టర్ సేవలు
  • ఫిబ్రవరి 23 వరకు సర్వీసులు కొనసాగుతాయన్న మంత్రి
Telangana Government to run helicopter services to Vemulawada

రేపు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలంగాణలోని శైవ క్షేత్రాలన్నీ ముస్తాబవుతున్నాయి. సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం వేములవాడ కూడా మహాశివరాత్రి శోభతో మెరిసిపోతోంది. కాగా, వేములవాడకు భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం హెలికాప్టర్ సర్వీసులు నడపాలని నిర్ణయించుకుంది. ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ కార్పొరేషన్ హెలికాప్టర్ సేవలకు రంగంలోకి దిగింది.

హైదరాబాద్ నుంచి వేములవాడ వెళ్లేందుకు ఒక్కొక్కరికి రూ.30 వేలు చార్జీగా నిర్ణయించారు. అయితే ఒక ట్రిప్పుకు కనీసం ఐదుగురు ప్రయాణికులు ఉండాలి. ఈ ప్యాకేజీలో భాగంగా హైదరాబాద్ నుంచి వేములవాడ తీసుకెళ్లి దర్శనానంతరం తిరిగి హైదరాబాద్ తీసుకొస్తారు. ఇక వేములవాడలో హెలికాప్టర్ ఎక్కే ఔత్సాహికుల కోసం మరో రెండు ప్యాకేజీలు తీసుకువచ్చారు. వేములవాడ నుంచి వ్యూపాయింట్ కు టికెట్ ధర రూ.3 వేలుగా నిర్ణయించారు. ఈ ప్రయాణం నిడివి 7 నిమిషాలు ఉంటుంది.

మరో ప్యాకేజీలో వేములవాడ నుంచి మిడ్ మానేరు డ్యామ్ పరిసరాల వీక్షణకు వెళ్లేందుకు టికెట్ వెల రూ.5,500 గా నిర్ణయించారు. దీనికి కనీసం ఆరుగురు ప్రయాణికులు ఉండాలి. ప్రయాణ నిడివి 16 నిమిషాలు ఉంటుంది. ఈ హెలికాప్టర్ సర్వీసులను తెలంగాణ టూరిజం శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఈ మధ్యాహ్నం బేగంపేట విమానాశ్రయంలో ప్రారంభించారు. ఫిబ్రవరి 23 వరకు ఈ సర్వీసులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.

More Telugu News