Priyanka Gandhi: ‘ప్రేమతో ప్రియాంకా ఆంటీ..’ ఆరేళ్ల పాపకు ప్రియాంకా గాంధీ లేఖ!

Priyanka Gandhi wrote Letter To 6 Year Old
  • నీకు ఎప్పుడు కావాలనిపిస్తే అప్పుడు ఫోన్ చెయ్యి
  • అనబియా ఇమాన్ అనే పాపకు చేత్తో లేఖ రాసి పంపిన ప్రియాంకా గాంధీ
  • ఒక స్కూల్ బ్యాగ్, టెడ్డీబేర్ బొమ్మ, లంచ్ బాక్స్, చాక్లెట్లు కూడా..

ఉత్తర ప్రదేశ్ లోని ఆజంఘడ్ కు చెందిన అనబియా ఇమాన్ అనే ఆరేళ్ల పాపకు ఊహించని బహుమతి దక్కింది. కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ స్వయంగా చేతిరాతతో ఆ పాపకు ఓ లెటర్ పంపారు. ఎప్పటికీ ధైర్యంగా ఉండాలని, భయపడొద్దని సూచించారు.

యాంటీ సీఏఏ ఆందోళన నేపథ్యంలో..

ఇటీవల ఆజంఘడ్ లో యాంటీ సీఏఏ ఆందోళనల్లో అరెస్టైన వారి కుటుంబాలను పరామర్శించడానికి ప్రియాంకా గాంధీ వెళ్లినప్పుడు ఈ పాపను కలిశారు. పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టినప్పుడు తాను, తమ ఆంటీతో కలిసి అక్కడే ఉన్నానని.. అప్పుడు చాలా భయపడ్డానని ఆ పాప ప్రియాంకా గాంధీకి చెప్పింది. ప్రియాంకా గాంధీ ఆ పాపను దగ్గరికి తీసుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కూడా.

‘ప్రియాంక ఆంటీ’ సంతకంతో..

ఆజంఘడ్ నుంచి వెళ్లిన వారం తర్వాత ప్రియాంకా గాంధీ నుంచి ఆ పాపకు బహుమతి అందింది. ప్రియాంక స్వయంగా చేతి రాతతో రాసిన ఉత్తరాన్ని ఆమెకు పంపారు. ‘డియర్ అనబియా. నీకోసం నేను కొన్ని గిఫ్టులు పంపుతున్నాను. అవి నీకు నచ్చుతాయని భావిస్తున్నాను. ఎప్పటికీ నువ్వు ధైర్యంగా ఉండాలి. నీకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు నాకు కాల్ చేయవచ్చు. ప్రేమతో.. ప్రియాంకా ఆంటీ’ అని ఆ లేఖలో రాశారు. ఒక స్కూల్ బ్యాగ్, లంచ్ బాక్స్, టెడ్డీబేర్ బొమ్మ, కొన్ని చాక్లెట్లు పంపారు. ఉత్తర ప్రదేశ్ కాంగ్రెస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షానవాజ్ ఆలమ్ స్వయంగా వాటన్నింటినీ అనబియాకు అందజేశారు.

  • Loading...

More Telugu News