Smriti Mandhana: ఏడాదిన్నర కాలంగా మా డ్రెస్సింగ్ రూమ్ ఇలాగే ఉంది: స్మృతి మంధన

Smriti Mandhana speaks about dressing room atmosphere
  • టి20 ప్రపంచకప్ కు సన్నద్ధమవుతున్న టీమిండియా మహిళల జట్టు
  • టోర్నీలో తమదే అత్యంత సంతోషకరమైన జట్టన్న మంధన
  • జట్టులో యువరక్తం పొంగిపొర్లుతోందని కామెంట్ 
మరికొన్నిరోజుల్లో ఆస్ట్రేలియాలో మహిళల టి20 వరల్డ్ కప్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధన ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈసారి తమ జట్టులో యువరక్తం పొంగిపొర్లుతోందని, టోర్నీలో తమదే అత్యంత సంతోషకరమైన జట్టు అని చెప్పగలనని తెలిపింది. తమ జట్టులోని సభ్యులంతా పాతికేళ్ల లోపు వారే ఎక్కువ మంది ఉన్నారని, జట్టు సగటు వయసు చూస్తేనే ప్రత్యేకమైన ఫీలింగ్ కలుగుతుందని వివరించింది.

ఈ వయసులో సరదాలే ఎక్కువగా ఉంటాయన్న మంధన, ఏడాదిన్నర కాలంగా తమ డ్రెస్సింగ్ రూమ్ లో ఉత్సాహం పరవళ్లు తొక్కుతోందని, ఇప్పడు కొత్తగా కొంతమంది టీనేజర్లు వచ్చాక మరింత ఉత్తేజభరితంగా మారిందని తెలిపింది. యువ క్రికెటర్లు త్వరగా అలవాటు పడేందుకు తాము చొరవతీసుకుని డ్యాన్సులు చేస్తూ, పాటలు పాడుతూ ఉల్లాసంగా ఉంచేందుకు ప్రయత్నిస్తామని వెల్లడించింది.

సంతోషం విషయంలో తమకు దగ్గరగా వచ్చే జట్టు థాయ్ లాండ్ మాత్రమేనని, ఆ జట్టులో కూడా యువ క్రికెటర్లే ఎక్కువ మంది ఉన్నారని వివరించింది. జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, షెఫాలీ వర్మ వంటి అమ్మాయిల రాకతో డ్రెస్సింగ్ రూమ్ మరింత ఆనందభరితంగా మారిందని మంధన పేర్కొంది.
Smriti Mandhana
TeamIndia
Women
DressingRoom

More Telugu News