Car Accident: అతి వేగమే ప్రాణం తీసింది.. భరత్‌నగర్ బ్రిడ్జిపై కారు ప్రమాదంలో తేలింది ఇదే!

  • మంగళవారం తెల్లవారుజామున ఘటన
  • అర్ధరాత్రి వేళ షికారుకు వెళ్లి ప్రమాదానికి గురైన యువకులు
  • అతివేగంతో నియంత్రణ కోల్పోయిన కారు
Over speed kills one in car accident on Bharathngar Bridge

హైదరాబాద్‌లోని భరత్‌నగర్ బ్రిడ్జిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదానికి అతి వేగమే కారణమని తేలింది. ఆరుగురు స్నేహితులు సరదా కోసం కారెక్కి ప్రమాదానికి గురయ్యారు. గంటకు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్తున్న కారు అదుపు తప్పి వంతెన రెయిలింగును ఢీకొని 30 అడుగుల పైనుంచి కిందపడింది. ఈ ప్రమాదంలో బోరబండకు చెందిన మహ్మద్ సోహైల్ (27) అనే యువకుడు ప్రాణాలు కోల్పోగా, సునీల్ (22), మోహిజ్ (19), గౌస్ (20), ఇర్ఫాన్ (18), అశ్వక్ (18) తీవ్రంగా గాయపడ్డారు.

సోహైల్ బంధువులకు చెందిన కారులో అర్ధరాత్రి వేళ వీరంతా నగరంలో షికారుకు బయలుదేరారు. సునీల్ కారు నడపగా అతడి పక్కన సోహైల్ కూర్చున్నాడు. మిగతా నలుగురు వెనక సీట్లో కూర్చున్నారు. తొలుత వీరందరూ హైటెక్ సిటీ వెళ్లి బిర్యానీ తిన్నారు. అక్కడి నుంచి బాలానగర్ చేరుకుని టీ తాగారు. తిరిగి బోరబండ వస్తూ అర్ధరాత్రి దాటాక 2:10 గంటల సమయంలో భరత్‌నగర్ బ్రిడ్జిపైకి చేరుకున్నారు.

వేగంగా దూసుకుపోతున్న కారు అదుపుతప్పి క్షణాల్లోనే రెయిలింగును ఢీకొని వంతెన కింద నిలిపి ఉంచిన జేసీబీ బాస్కెట్‌పై పడింది. ఆ సమయంలో అక్కడ ఉన్నవారు బాంబు పేలిందేమోనన్న భయంతో పరుగులు తీశారు. అయితే, పడింది కారు అని గుర్తించి అందులో చిక్కుకున్న వారిని జేసీబీ సాయంతో వెలికితీశారు. అదే సమయంలో పోలీసులకు సమాచారం అందించారు. సోహైల్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన మిగతా వారిని చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అయితే, కారులో ఉన్నవారు ఎవరూ మద్యం తాగలేదని తేలింది.

More Telugu News