Corona Virus: వూహాన్​ ఆసుపత్రి డైరెక్టర్​ కూడా కరోనాతో మృతి.. 1,863కు చేరిన మృతుల సంఖ్య

Wuhan Hospital Director Dies Of Coronavirus
  • ప్రమాదకర పరిస్థితుల్లో మెడికల్ స్టాఫ్
  • సరిపడా మాస్కులు, ప్రొటెక్టివ్ సూట్లు లేవని సిబ్బంది ఆందోళన
  • కొత్తగా నమోదయ్యే కేసులు తగ్గుతున్నాయని ప్రకటించిన చైనా అధికారులు
చైనాలో కరోనా వైరస్ వ్యాప్తికి కేంద్ర స్థానమైన వూహాన్ లోని వుచాంగ్ హాస్పిటల్ డైరెక్టర్ ల్యూ జిమింగ్  కూడా వైరస్ బారినపడి చనిపోయారు. ఆయనను రక్షించడానికి అన్ని ప్రయత్నాలు చేశామని, అయినా కాపాడుకోలేకపోయామని చైనా నేషనల్ హెల్త్ కమిషన్ మంగళవారం ప్రకటించింది. దీనిపై చైనా వ్యాప్తంగా తీవ్ర సంతాపం వ్యక్తమైంది.

ప్రమాదకర పరిస్థితుల్లో మెడికల్ స్టాఫ్

వైరస్ వ్యాప్తి భారీగా పెరిగిపోవడంతో చైనాలో మెడికల్ స్టాఫ్ ప్రమాదకర పరిస్థితుల్లో పనిచేస్తున్నారు. ఎన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నా కూడా మెడికల్ స్టాఫ్ కు కరోనా వైరస్ సోకుతోంది. ఇప్పటివరకు 1,716 మంది మెడికల్ స్టాఫ్ కరోనా వైరస్ బారిన పడ్డారని, అందులో ఆరుగురు చనిపోయారని అధికారులు వెల్లడించారు. వూహాన్ లోని ఆసుపత్రుల్లో వేలాది మంది చికిత్స పొందుతున్నారని.. మెడికల్ స్టాఫ్ కు సరిపడా మాస్కులు, ప్రొటెక్టివ్ సూట్లు అందుబాటులో లేవని కొందరు హెల్త్ వర్కర్లు ఆరోపించారు.

1,863కు చేరిన మృతుల సంఖ్య

చైనా వ్యాప్తంగా కరోనా వైరస్ బారిన పడినవారిలో సోమవారం నాడు మరో 93 మంది మరణించారని, దీంతో మొత్తంగా చనిపోయినవారి సంఖ్య 1,863కు చేరిందని అధికారులు ప్రకటించారు. మొత్తంగా వైరస్ సోకిన వారి సంఖ్య 72,300కు చేరిందని తెలిపారు. సోమవారం అర్ధరాత్రి వరకు కొత్తగా 1,807 కేసులు నమోదయ్యాయని చెప్పారు. కొత్తగా వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య తగ్గుతోందని, త్వరలోనే కరోనా నియంత్రణలోకి వస్తుందని ప్రకటించారు.
Corona Virus
wuhan hospital
china
corona epidemic

More Telugu News