Article 370: ఆర్టికల్ 370, సీఏఏలపై వెనకడుగు వేసేలా ఎవరు ఒత్తిడి చేస్తున్నారు?: బీజేపీకి శివసేన ప్రశ్న

Who is pressurising govt to go back on CAA and Article 370 asks Shiv Sena
  • ఈ అంశాలపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పదేపదే ఎందుకు చెబుతున్నారు?
  • వీటి గురించి మాట్లాడటం ఆపేయండి
  • ట్రంప్ పర్యటనను ఒక చక్రవర్తి పర్యటనలా చూస్తున్నారు

బీజేపీపై ఆ పార్టీ పాత స్నేహితురాలు శివసేన మరోసారి విమర్శలు ఎక్కుపెట్టింది. ఆర్టికల్ 370, పౌరసత్వ సవరణ చట్టం పేరుతో పొలిటికల్ మైలేజ్ ను పెంచుకోవడానికి బీజేపీ యత్నిస్తోందని ఆరోపించింది. వారణాసిలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ఆర్టికల్ 370, సీఏఏలపై వెనకడుగు వేసే ప్రసక్తే లేదని చెప్పారని.. ఈ విషయాన్ని మోదీ, అమిత్ షాలు పదేపదే ఎందుకు చెపుతున్నారని ప్రశ్నించింది. ఈ అంశాలపై వెనకడుగు వేయాలని ఎవరి నుంచి ఒత్తిడి ఉందో వీరిద్దరూ చెప్పాలని డిమాండ్ చేసింది.

సీఏఏకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతూనే ఉన్నాయని, కశ్మీర్ మిస్టరీ ఇంకా కొనసాగుతూనే ఉందని శివసేన వ్యాఖ్యానించింది. ఆర్టికల్ 370ని రద్దు చేసిన తర్వాత కూడా కశ్మీరీ పండిట్లు ఇంకా ఇబ్బందులు పడుతూనే ఉన్నారని చెప్పింది. కశ్మీరీ పండిట్ల జీవితంలో ఎలాంటి మార్పు రాలేదని తెలిపింది. ఆర్టికల్ 370, సీఏఏలపై మాట్లాడటాన్ని అమిత్ షా ఆపడం మంచిదని... ఢిల్లీ ఎన్నికల్లో ఈ అస్త్రాలు పని చేయలేదని ఎద్దేవా చేసింది.

ఆర్టికల్ 370ని రద్దు చేయడం ద్వారా కశ్మీర్ ను భారత్ లో భాగం చేశామని చెప్పుకోవడాన్ని కేంద్ర ప్రభుత్వం ఆపేయాలని శివసేన విమర్శించింది. కశ్మీర్ మొదటి నుంచి కూడా భారత్ లో అంతర్భాగమని చెప్పింది. వాక్చాతుర్యాన్ని తగ్గించి, పనిపై ధ్యాసను కేంద్రీకరించాలని హితవు పలికింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పర్యటన నేపథ్యంలో భారీ ఏర్పాట్లను చేస్తుండటాన్ని కూడా శివసేన తప్పుబట్టింది. బానిస మనస్తత్వానికి ఇది నిదర్శనమని మండిపడింది. ట్రంప్ పర్యటనను ఒక చక్రవర్తి పర్యటనలా చూస్తున్నారని విమర్శించింది.

  • Loading...

More Telugu News