China: మరో ఘన రికార్డుపై చైనా కన్ను... ఆరు రోజుల్లో మాస్కుల ఫ్యాక్టరీ!

  • రోజుకు 2.50 లక్షల మాస్క్ ల తయారీ లక్ష్యం
  • ఆదివారం నాడు మాస్క్ ల తయారీ ప్రారంభం
  • ఇటీవలే 10 రోజుల్లో 1000 పడకల ఆసుపత్రి నిర్మాణం
China wants to Build Mask Factory in 6 Days

ఇటీవల పదంటే పది రోజుల్లో 1000 పడకల ఆసుపత్రిని నిర్మించి, తన శ్రామిక సత్తాను ప్రపంచానికి చాటిన చైనా, ఇప్పుడు మరో ఘనతను సాధించనుంది. కేవలం ఆరు రోజుల వ్యవధిలో బీజింగ్ లో ఓ ఫ్యాక్టరీని నిర్మించాలని నిశ్చయించింది. రోజురోజుకూ కరోనా వైరస్ వ్యాప్తి పెరుగుతూ ఉండటం, చాలినన్ని మాస్కులను సరఫరా చేయలేకపోతూ ఉండటంతో, రోజుకు 2.50 లక్షల మాస్క్ లను తయారు చేసేలా ఈ ఫ్యాక్టరీని నిర్మించాలని కంకణం కట్టుకుంది.

సోమవారం నాడు ఫ్యాక్టరీ నిర్మాణం పనులు ప్రారంభం కాగా, ఆదివారం నాటికి నిర్మాణాన్ని పూర్తి చేసి, ఆ వెంటనే ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు చైనా అధికారులు తెలిపారు. షిఫ్ట్ ల వారీగా ఇక్కడ 24 గంటలూ నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు.

కాగా, కోవిడ్ -19 వైరస్ సోకి చైనాలో ఇంతవరకూ 1800 మందికి పైగా మరణించారు. నిన్న ఒక్కరోజే దాదాపు 100 మంది మరణించారని వైద్య వర్గాలు వెల్లడించాయి. వైరస్ సోకిన వారి సంఖ్య 70 వేలకు పైగానే ఉందని అధికారులు అంటున్నారు. ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వైరస్ ను అంచనా వేసేందుకు ఓ బృందాన్ని పంపగా, వారిని హుబెయ్ ప్రావిన్స్, వూహాన్ ప్రాంతాల్లోకి వెళ్లనివ్వబోమని చైనా స్పష్టం చేసింది. ఇప్పటికే హుబెయ్ లో ప్రజల కదలికలను నియంత్రించిన చైనా సర్కారు, ఆంక్షలను మరింత కఠినం చేసింది.

  • Loading...

More Telugu News