Vikarabad District: ప్రయాణికులతో ఉన్న బస్సు చోరీ.. లారీని ఢీకొట్టి పరారీ!

TSRTC bus theft by unidentified man in Telangana
  • వికారాబాద్ జిల్లా తాండూరులో ఘటన
  • భోజనానికి వెళ్లిన డ్రైవర్, కండక్టర్
  • నిందితుడి కోసం గాలిస్తున్న పోలీసులు
ఈ చోరుడు మహా ఘనుడు. బస్టాండులో ప్రయాణికులతో నిండి ఉన్న బస్సునే ఎత్తుకెళ్లాడు. మార్గమధ్యంలో ఓ  లారీని ఢీకొట్టడంతో భయపడి బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు. వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగిన ఈ ఘటన సంచలనమైంది. పోలీసుల కథనం ప్రకారం.. తాండూరు డిపోకు చెందిన బస్సు ఆదివారం రాత్రి కరణ్‌కోట్ వెళ్లేందుకు రెడీ అయింది. డ్రైవర్ ఇలియాస్, కండక్టర్ జగదీశ్‌ కలిసి భోజనానికి వెళ్లారు.

బస్సెక్కిన ప్రయాణికులు డ్రైవర్, కండక్టర్ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈలోగా ఓ వ్యక్తి వచ్చి బస్సును స్టార్ట్ చేశాడు. కండక్టరు లేకుండానే బస్సు కదలడంతో అనుమానించిన ప్రయాణికులు అతడిని ప్రశ్నించారు. ఈ బస్సుకు తానే డ్రైవర్ కమ్ కండక్టర్‌నని వారికి చెప్పాడు. ప్రయాణికులు నిజమేనని నమ్మడంతో అతడు బస్సు తీశాడు. బస్సు రోడ్డెక్కి రయ్‌మంటూ దూసుకుపోయింది.

ఈ క్రమంలో పట్టణంలోని మల్లప్పమడిగ వద్ద ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. దీంతో భయపడిన నిందితుడు బస్సును అక్కడే వదిలేసి పరారయ్యాడు. ప్రయాణికుల ద్వారా సమాచారం అందుకున్న డిపో మేనేజర్ బస్సును తిరిగి డిపోకు తరలించారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Vikarabad District
Tandur
TSRTC Bus
Road Accident

More Telugu News