Odisha: అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదా.. అన్నయ్య కుటుంబాన్ని వెంబడించి మరీ గొడ్డలితో నరికి చంపిన తమ్ముడు!

Man Murders brothers family with axe
  • ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లాలో ఘటన
  • అన్న, వదిన, ఇద్దరు చిన్నారులను దారుణంగా హత్య చేసిన నిందితుడు
  • అనంతరం పోలీస్ స్టేషన్‌ కు వెళ్లి లొంగుబాటు

అన్నదమ్ముల మధ్య తలెత్తిన ఆస్తి వివాదం అన్న కుటుంబం మొత్తాన్ని తుడిచిపెట్టేలా చేసింది. సోదరుడిపై కక్ష పెంచుకున్న తమ్ముడు.. భయంతో పరుగులు పెడుతున్నా వెంబడించి మరీ సోదరుడి కుటుంబ సభ్యులను గొడ్డలితో నరికి చంపాడు. మృతుల్లో అభంశుభం తెలియని ఇద్దరు చిన్నారులు కూడా ఉండడం విషాదం. ఒడిశాలోని సుందర్‌గఢ్ జిల్లా దెవులహుడిలో జరిగిందీ దారుణం.

పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కందె ముండా, కాళీ ముండాలు అన్నదమ్ములు. ఆస్తి పంపకాల విషయంలో ఇద్దరి మధ్య గత కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో అసంతృప్తితో రగిలిపోతున్న కాళీ.. అన్నపై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో అన్న కందెముండా ఇంటికి వెళ్లిన కాళీ.. నిద్రపోతున్న అన్నయ్యపై గొడ్డలితో దాడిచేశాడు.

తీవ్రంగా గాయపడిన ముండా.. పెద్దగా అరుస్తూ భయంతో పరుగులు తీశాడు. అతడి అరుపులకు మేల్కొన్న భార్య సుములి, ఇద్దరు పిల్లలు సమిలి (7), మరా (5)లు కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని అతడి వెనక పరుగుపెట్టారు. అయినప్పటికీ వదలని కాళీ.. వారిని వెంబడించి ఒకరి తర్వాత ఒకరిని గొడ్డలితో నరికి చంపాడు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News