రాజకీయాలు నాకు రిటైర్మెంట్ ప్లాన్ కాదు: పవన్ కల్యాణ్

16-02-2020 Sun 20:37
  • మంగళగిరిలో జనసేన న్యాయవిభాగం సమావేశం
  • సమాజానికి సేవ చేసే సత్తా ఉందని భావించే రాజకీయాల్లోకి వచ్చానన్న పవన్
  • జనసేన ఏ పార్టీలో విలీనం కాదని స్పష్టీకరణ
Pawan meets Janasena legal cell members

మంగళగిరిలో ఇవాళ జనసేన న్యాయవిభాగం సమావేశం నిర్వహించారు. పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఈ సమావేశంలో మాట్లాడుతూ, జనసేన పార్టీని బతికించింది సామాన్యుడేనని, అలాంటి సామాన్యుడికి జనసేన న్యాయవిభాగం కవచంలా పనిచేయాలని ఆకాంక్షించారు. న్యాయవాదుల నుంచి బలమైన నాయకులు రావాలని కోరుకుంటున్నామని తెలిపారు. పార్టీకి అండగా ఉన్నవారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని పవన్ ఆరోపించారు. తనలో సమాజానికి సేవ చేసే సత్తా ఉందని భావించిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చానని వెల్లడించారు. రాజకీయాలు తనకు రిటైర్మెంట్ ప్లాన్ కాదని స్పష్టం చేశారు. ప్రజలకు సేవ చేసే మార్గంగానే రాజకీయాలను ఎంచుకున్నానని వివరించారు. ఇక తాజా పరిణామాలపై వ్యాఖ్యానిస్తూ, జనసేన పార్టీని ఏ పార్టీలోనూ విలీనం చేసేది లేదని తేల్చి చెప్పారు.