తెలంగాణకు కేంద్రం తగిన సాయం చేస్తోంది.. అనవసర రాద్ధాంతం చేయొద్దు: నిర్మలా సీతారామన్

16-02-2020 Sun 19:33
  • ఫండ్స్ పై మాట్లాడుతూ ‘గివెన్’ అన్న పదం వాడితే తప్పుపడుతున్నారు
  • కేంద్ర మంత్రి క్యాజువల్ గా అన్నారు
  • అభ్యంతరముంటే ఫిర్యాదు చేసుకోవాలని టీఆర్ఎస్ లీడర్లకు సూచన
Telangana got adequate funds said FM Nirmala seetharaman
కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు గణనీయమైన స్థాయిలో నిధులు అందుతున్నాయని, అయినా రాద్ధాంతం చేస్తున్నారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. ఆదివారం హైదరాబాద్ లో పర్యటించిన ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘కేటీఆర్ సహా కొందరు తెలంగాణ లీడర్లు మాట్లాడిన మాటలు విన్నాను. కేంద్రం సహకరించలేదని అనడం సరికాదు..’’ అని స్పష్టం చేశారు.

క్యాజువల్ గా గివెన్ అన్నారు

పార్లమెంటులో తెలంగాణకు నిధుల అంశంపై సమాధానం ఇచ్చిన కేంద్ర మంత్రి క్యాజువల్ గా ‘గివెన్’ అన్న పదం వాడారని, కానీ దానిపై రాద్ధాంతం చేస్తున్నారని నిర్మలా సీతారామన్ విమర్శించారు. గివెన్ అంటూ నిధులు అందజేశామని చెప్పారన్నారు. కానీ ఆ పదాన్ని పట్టుకుని ఏదో ఉచితంగా ఇస్తున్నట్టు మాట్లాడటమేమిటంటూ విమర్శలు చేయడం సరికాదని చెప్పారు. ఏ రాష్ట్రం కూడా కేంద్రానికి కాంట్రిబ్యూట్ చేయడం లేదని చెప్పట్లేదని.. కేంద్ర మంత్రి క్యాజువల్ గానే ఆ మాట అన్నారని వివరించారు. ఆ పదం వాడేందుకు పార్లమెంటులో అనుమతి ఉందని, ఏదైనా అభ్యంతరం ఉంటే లోక్ సభ స్పీకర్ కు ఫిర్యాదు చేసుకోవచ్చని సూచించారు.

తగిన సాయం చేస్తున్నాం

తెలంగాణకు కేంద్రం అన్యాయం చేయడం లేదని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. కేంద్రం సహకరించడం లేదన్నది అవాస్తవమని, కేంద్రం నుంచి తెలంగాణకు గణనీయమైన స్థాయిలో సాయం అందుతోందని చెప్పారు. దేశంలో తెలంగాణ సహా ప్రతి రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇస్తోందని తెలిపారు.