ఐపీఎల్ -2020 షెడ్యూల్ వచ్చేసింది!

16-02-2020 Sun 06:42
  • మార్చి 29న పోటీలు మొదలు
  • తొలి మ్యాచ్ ముంబై, చెన్నై జట్ల మధ్య
  • ఏప్రిల్ 1న సన్ రైజర్స్ తొలి మ్యాచ్
IPL 2020 Schedule

ఐపీఎల్ (ఇండియన్ ప్రీమియర్ లీగ్) 2020 షెడ్యూల్ ఖరారైంది. మార్చి 29న ముంబైలో ఈ పోటీలు ప్రారంభం కానుండగా, తొలి మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, గత సంవత్సరపు రన్నరప్ చెన్నై సూపర్ కింగ్స్ వాంఖడే స్టేడియంలో తలపడనున్నాయి. మే 17న ఆఖరి లీగ్ మ్యాచ్, మే 24న ఫైనల్ జరుగనున్నాయి.

ఇక ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఒకే మ్యాచ్ జరిపేలా షెడ్యూల్ ను ఖరారు చేయడంతో, మ్యాచ్ లు జరిగే రోజుల సంఖ్య 44 నుంచి 50కి పెరిగింది. రాజస్థాన్ రాయల్స్ మినహా మిగతా ఫ్రాంచైజీలు తమ సొంత వేదికలను కొనసాగించాలనే నిర్ణయించుకోగా, రాజస్థాన్ మాత్రం గువాహటిలో రెండు మ్యాచ్ లను నిర్వహించాలని భావిస్తోంది. ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.

ఇక హైదరాబాద్ సన్ రైజర్స్ విషయానికి వస్తే, ఉప్పల్ లో తొలి మ్యాచ్ ని ఏప్రిల్ 1వ తేదీన ఆడనున్న జట్టు, ఆపై 12, 16, 26, 30, మే నెలలో 5, 12 తేదీల్లో మ్యాచ్ లను ఆడనుంది. ఇతర ఫ్రాంచైజీల సొంత వేదికలపై ఏప్రిల్ 4, 7, 19, 21, మే 3, 9, 15 తేదీల్లో సన్ రైజర్స్ మ్యాచ్ లు జరుగుతాయి.