CM Jagan: ఢిల్లీ టూర్ ముగించుకుని అమరావతికి చేరుకున్న సీఎం జగన్

  • ఈ రోజు కేంద్రమంత్రి రవిశంకర్ తో భేటీ
  • 50 నిమిషాలపాటు కొనసాగిన సమావేశం
  • రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ, మండలి రద్దుపై జగన్ వివరణ
 AP CM Jagan Delhi Tour Ends

ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో తన రెండు రోజుల పర్యటనను ముగించుకున్నారు. కాసేపటి క్రితమే ఆయన అమరావతికి చేరుకున్నారు. శుక్రవారం నాడు కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ అయిన సీఎం ఈ రోజు కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తో సమావేశమయ్యారు. యాబై నిమిషాల పాటు వీరిద్దరి భేటీ కొనసాగింది. ఈ సమావేశంలో రాజధాని కార్యకలాపాలు, అభివృద్ధి వికేంద్రీకరణ, శాసన మండలి రద్దు, కర్నూలుకు హైకోర్టు తరలింపు తదితర అంశాలపై  కేంద్రమంత్రికి జగన్ వివరించారు.

మూడు రాజధానుల ప్రతిపాదనలో భాగంగా లేజిస్లేటివ్ క్యాపిటల్ గా అమరావతి, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం, జ్యుడీషియల్ క్యాపిటల్ గా కర్నూలు ఏర్పాటుకు తమ మంత్రివర్గం ఆమోదించిందని తెలిపారు. దీనికుద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి చట్టం-2020కు అసెంబ్లీ ఆమోదం లభించిందని కేంద్రమంత్రికి వివరించారు. ఈ చట్టంలో భాగంగా కర్నూలుకు హైకోర్టును తరలించడానికి కేంద్ర న్యాయ శాఖ సహకరించాలని కోరారు.

రాయలసీమ ప్రాంతంలో శాశ్వత ప్రాతిపదికన హైకోర్టును ఏర్పాటు చేస్తామంటూ 2019 ఎన్నికల సమయంలో బీజేపీ తన మేనిఫెస్టోలో పేర్కొందని జగన్ ఈ సందర్భంగా కేంద్రమంత్రికి గుర్తు చేశారు. శాసన మండలి రద్దుకు తమ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందని.. తదుపరి చర్యలను కేంద్రం తీసుకోవాలని జగన్ కేంద్రమంత్రిని కోరారు. మహిళలు, చిన్నారులపై నేరాల నియంత్రణకు దిశ చట్టాన్ని తెస్తున్నామని.. దీన్ని కూడా వీలైనంత త్వరలో అమల్లోకి తేవడానికి న్యాయశాఖ చొరవచూపాలని కోరారు.

More Telugu News