మెట్రో ప్రారంభోత్సవానికి రావాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి నేనే ఫోన్ చేశా: మంత్రి తలసాని

15-02-2020 Sat 20:41
  • ప్రజలకు అసౌకర్యం కలుగొద్దన్న ఉద్దేశంతో తొందరగా ప్రారంభించాం
  • ప్రొటోకాల్ పరంగా ఇబ్బంది కలిగినా.. కావాలని చేసింది కాదు
  • ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఫొటో పెట్టాం
I personally called union Minister Kishan Reddy To attend Metro Inauguration say Talasani Srinivas Yadav

ఇటీవల హైదరాబాద్ లో జేబీఎస్-ఎంజీబీఎస్ మెట్రో రైలు సర్వీసుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో తనను ఆహ్వానించలేదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించడం తగదని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమానికి ముందురోజు స్వయంగా తాను ఫోన్ చేసి కిషన్ రెడ్డిని ఆహ్వానించానన్నారు. ప్రజలకు అసౌకర్యం కలుగొద్దన్న ఉద్దేశంతో తొందరగా ప్రారంభించామన్నారు.

ఆ సమయంలో ప్రొటోకాల్ పరంగా కేంద్రమంత్రికి ఇబ్బంది కలిగినా అది కావాలని చేసింది కాదన్నారు. తలసాని శ్రీనియాదవ్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. మెట్రో ప్రాజెక్ట్ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఫొటో లేదని కిషన్ రెడ్డి, బీజేపీ నేతలు చేస్తోన్న వాదనలు నిజం కావన్నారు. ఇప్పటికీ ఆరోజు ఏర్పాటు చేసిన హోర్డింగ్స్, ఫ్లెక్సీలు అలాగే ఉన్నాయంటూ.. కావాలంటే వెళ్లి చూసుకోవచ్చన్నారు.

ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అతిగా నోరు పారేసుకోబట్టే తెలంగాణలో బీజేపీ పతనమవుతోందని తలసాని వ్యాఖ్యానించారు. అనవసరంగా తమపై విమర్శలు చేస్తే ఊరుకోమని తలసాని చెప్పారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులకోసం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కృషి చేయాలన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల విషయంలో కిషన్ రెడ్డి చేసిన ఆరోపణలను తలసాని ఖండించారు. నగరంలో మెట్రో సర్వీసులను విస్తరించే ప్రణాళికలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు.