Nizamabad District: పెళ్లింట విషాదం...మూడు ముళ్లు వేసిన కాసేపటికే వరుడి మృతి

  • వినోదంలో భాగంగా నృత్యాలు
  • డీజే సౌండ్‌కు గుండెపోటు వచ్చి తీవ్ర అస్వస్థత
  • ప్రైవేటు ఆసుపత్రికి తరలించినా చికిత్స పొందుతూ మృతి
కొడుకు ఓ ఇంటివాడవుతున్న సందర్భంగా ఆ ఇంట్లో సందడే సందడి. వివాహ వేడుక సందర్భంగా ఇల్లంతా సంతోష సాగరంలో మునిగితేలుతోంది. పిల్లలు, పెద్దలు అన్న తేడా మరిచి ఎంజాయ్‌ చేస్తున్నారు. మధ్యాహ్నం పెళ్లి తంతు పూర్తయింది. రాత్రికి పెళ్లికొడుకు చనిపోయాడు. అప్పటి వరకు సందడికి కేరాఫ్‌ అనిపించిన ఇంటిని విషాదం చుట్టుముట్టేసింది. కుటుంబ సభ్యులు, బంధువుల కథనం మేరకు...నిజామాబాద్‌ జిల్లా బోదన్‌ పట్టణానికి చెందిన మంగళి గణేష్‌ (25)కు నిన్న మధ్యాహ్నం పెళ్లయింది.

రాత్రికి సంప్రదాయంలో భాగంగా ‘బారాత్‌’ నిర్వహించారు. కుటుంబ సభ్యులతోపాటు పెళ్లికొడుకు డ్యాన్స్‌తో అదరగొట్టాడు. కానీ డీజే సౌండ్‌ను అతని గుండె తట్టుకోలేకపోయింది. తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలిపోయాడు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ రాత్రి రెండు గంటల సమయంలో తుదిశ్వాస వదిలాడు. నూరేళ్లు తోడుంటానని బాసలు చేసి కాసేపటి క్రితమే తన మెడలో మూడు ముళ్లు వేసిన  వ్యక్తి అంతలోనే అందని లోకాలకు వెళ్లిపోవడంతో ఆ యువతి వేదన వర్ణనాతీతం.
Nizamabad District
bridegroom
died after marriage

More Telugu News