మీ బ్రతుకు ఇంతేనా..? ఇదేనా మీ నైజం..?: వైసీపీ నేతలపై పంచుమర్తి ఫైర్

14-02-2020 Fri 19:37
  • చంద్రబాబుపై వైసీపీ నేతల విమర్శల దాడి
  • ఘాటుగా స్పందించిన పంచుమర్తి అనురాధ
  • వైఎస్సార్ 26 ఎంక్వైరీలు వేసినా ఏమీ చేయలేకపోయారని వ్యాఖ్యలు
Panchumarthi Anuradha questions YSRCP leaders

చంద్రబాబు రూ.2 లక్షల కోట్ల అవినీతిపరుడు అంటూ వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తుండడం పట్ల టీడీపీ మహిళా నేత పంచుమర్తి అనురాధ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ బ్రతుకు ఇంతేనా? ఇదేనా మీ నైజం? అంటూ వైసీపీ నేతలపై మండిపడ్డారు. సీఎం జగనే స్వయంగా లక్షల కోట్ల రూపాయల మేర అవినీతి కేసుల్లో ఉన్నారని ఆరోపించారు. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నేరచరిత్ర మొత్తం ఆయా పార్టీల వెబ్ సైట్లలో ప్రదర్శించాలని సుప్రీంకోర్టు కూడా పేర్కొందని, ఆ విధంగా మీ నేర చరిత్రను వెబ్ సైట్ లో ఉంచితే సర్వర్లు సరిపోవని ఎద్దేవా చేశారు.

"మీరా మా గురించి మాట్లాడేది? మంచి కుక్కపై పిచ్చికుక్క అని ముద్రవేస్తే అందరూ దాన్ని చంపేస్తారన్నది తెలిసిన విషయమే. వైసీపీ ఈ విధమైన రాజకీయాలు చెయ్యాలనుకుంటోంది. గతంలో రాజశేఖర్ రెడ్డి 26 ఎంక్వైరీలు వేసినా చంద్రబాబును ఏమీ చేయలేకపోయారు. విజయమ్మ 2600 పేజీలతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆధారాల్లేకుండా వచ్చి సమయం వృథా చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు ఆమెను మందలించింది. ఈ విషయం వైసీపీ నేతలకు గుర్తులేదా?" అంటూ మండిపడ్డారు.