తన కారుపై దాడి జరిగిందంటూ కత్తి మహేశ్ ఫిర్యాదు

14-02-2020 Fri 18:55
  • ఐమాక్స్ సినిమా చూసి వస్తుండగా దాడి
  • ముగ్గురిని అదుపులోకి తీసుకున్న సైఫాబాద్ పోలీసులు
  • రాముడిపై కత్తి వ్యాఖ్యల కారణంగానే దాడి చేశామన్న వ్యక్తులు!
Kathi Mahesh complains as he was attacked

బిగ్ బాస్ రియాల్టీ షో, ఆ తర్వాత పవన్ కల్యాణ్ పై విమర్శలతో సినీ విమర్శకుడు కత్తి మహేశ్  విపరీతమైన గుర్తింపు తెచ్చుకున్నారు. సినీ విమర్శకుడిగా కంటే వివాదాలతోనే మీడియా దృష్టిని విశేషంగా ఆకర్షించారు. తాజాగా కత్తి మహేశ్ మరోసారి వార్తల్లోకెక్కారు. హైదరాబాద్ లో తనపై దాడి జరిగిందంటూ ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఐమాక్స్ థియేటర్ లో సినిమా చూసి వస్తుండగా, కొందరు వ్యక్తులు దాడి చేసినట్టు సైఫాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ దాడిలో కత్తి మహేశ్ కారు ముందు భాగంలోని అద్దాలు ధ్వంసమైనట్టు తెలుస్తోంది. కత్తి ఫిర్యాదుతో సైఫాబాద్ పోలీసులు ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకున్నారు. వారిని భజరంగ్ దళ్ కార్యకర్తలుగా భావిస్తున్నారు. రాముడిపై కత్తి మహేశ్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే దాడి చేసినట్టు సదరు వ్యక్తులు చెప్పినట్టు సమాచారం.