పవర్ బ్యాంక్ సౌండ్ విని బాంబు అనుకున్నారు.. సుప్రీంకోర్టులో కాసేపు భయం భయం

14-02-2020 Fri 16:52
  • బ్యాగు నుంచి సౌండ్ వస్తుండటంతో అలర్ట్
  • దూరంగా పరుగులు పెట్టిన లాయర్లు, జనం
  • గ్రౌండ్ లోకి తీసుకెళ్లి పరిశీలించిన సెక్యూరిటీ సిబ్బంది
Beeping power bank triggers bomb scare in supreme court

మొబైల్ డివైజ్ ల చార్జింగ్ కోసం వాడే పవర్ బ్యాంక్ శుక్రవారం సుప్రీంకోర్టులో కలకలం సృష్టించింది. సుప్రీంకోర్టులోని నాలుగో హాల్ బయట లాయర్లకు ఓ అనుమానాస్పద బ్యాగ్ కనిపించింది. చాలా సేపటి నుంచి అక్కడే ఉన్న ఆ బ్యాగ్ నుంచి బీప్ బీప్ మంటూ సౌండ్ వస్తుండటంతో బాంబు కావొచ్చని అనుమానించారు. దీంతో లాయర్లు, కోర్టుకు వచ్చినవారంతా భయపడి దూరంగా వెళ్లిపోయారు.

జాగ్రత్తగా గ్రౌండ్ లోకి తీసుకెళ్లి..

సెక్యూరిటీ సిబ్బంది వెంటనే నాలుగో హాల్ వద్దకు చేరుకున్నారు. జాగ్రత్తగా ఆ బ్యాగును గ్రౌండ్ లోకి తీసుకెళ్లి పరిశీలించారు. ఖాళీగా ఉన్న ఆ బ్యాగులో ఓ పవర్ బ్యాంకు, కొన్ని పేపర్లను గుర్తించారు. పవర్ బ్యాంకులో చార్జింగ్ తగ్గిపోవడంతో అలర్ట్ చేస్తూ బీప్ బీప్ మంటూ శబ్దం చేస్తున్నట్టు గమనించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ బ్యాగును కంట్రోల్ రూమ్ కు అప్పగించారు. తర్వాత ఎందుకైనా మంచిదని కోర్టు హాళ్ల పరిసరాల్లో తనిఖీలు కూడా చేశారు.