Kolkata: కోల్ కతాలో మూడుకు చేరిన కరోనా బాధితుల సంఖ్య

  • తాజాగా మరో వ్యక్తికి కరోనా సోకిందని నిర్ధారణ
  • ఇప్పటికే ఇద్దరికి కరోనా ఉందని తేల్చిన వైద్యులు
  • భారత్ కు కరోనా సోకే అవకాశాలు 0.2 శాతమేనని నివేదిక వెల్లడి
In Kolkata Carona Outbreaks Three Positive cases registered

భారత్ లోనూ (కోవిడ్-19) కరోనా వైరస్ బాధితుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. కోల్ కతా లో మూడో కరోనా కేసు నమోదైంది. నగరంలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో మరో వ్యక్తికి నావల్ కరోనా వైరస్ సోకినట్టు నిర్ధారణ చేశారు. ఈ మేరకు విమానాశ్రయ అధికారులు ఒక ప్రకటన చేస్తూ.. బ్యాంకాక్ నుంచి కోల్ కతా చేరుకున్న ప్రయాణికుడికి పరీక్షలు చేయగా కరోనా వైరస్ పాజిటివ్ గా తేలిందని తెలిపారు.

ఈ తాజా కేసుతో కోల్ కతాలో కరోనా సోకిన వారి సంఖ్య మూడుకు చేరింది. ఈ వారంలో హిమాద్రి బార్మాన్, నాగేంద్ర సింగ్ అనే ఇద్దరు ప్రయాణికులకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ గా తేలారని చెప్పారు. పాజిటివ్ గా తేలిన వారిని బలియాఘటా ఐడి అస్పత్రికి పంపినట్లు అధికారులు వెల్లడించారు. కరోనా వైరస్ ప్రభావంతో చైనాకు సర్వీసులు నడుపుతున్న పలు విమానాయన సంస్థలు తమ సర్వీసులను నిలిపివేశాయి.

కరోనా వ్యాప్తిపై పరిశోధకుల నివేదిక

మరోపక్క కరోనా వైరస్ వ్యాప్తి చెందే తీరుపై ఇటీవల జర్మనీలోని రాబర్ట్ కోచ్ ఇన్సిట్యూట్ పరిశోధకులు మోడల్ నెట్ వర్క్ ద్వారా అధ్యయనం చేసి ఓ నివేదిక వెలువరించారు. ఈ వైరస్ సోకే ప్రమాదమున్న తీవ్రతను బట్టి ఆయా దేశాలకు పర్సెంటేజీలను ఇచ్చారు. విమాన ప్రయాణికుల ద్వారా ఈ వ్యాధి వ్యాపించే అవకాశముందని తేల్చారు. థాయ్ లాండ్ కు వైరస్ సోకే అవకాశాలు 2.1 శాతం ఉండగా, భారత్ కు ఇది 0.2 శాతం ఉందని నివేదిక వెల్లడించింది.  

వైరస్ వ్యాపించే అవకాశమున్న మొదటి పది దేశాల్లో వరుసగా థాయ్ లాండ్, జపాన్, దక్షిణ కొరియా, హాంకాంగ్, తైవాన్, అమెరికా, వియత్నాం, మలేషియా, సింగపూర్, కంబోడియాలున్నాయి. కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్ష వర్దన్ ట్విట్టర్ వేదికగా ఒక సందేశాన్ని పోస్ట్ చేస్తూ.. ఇప్పటివరకు 2,51,447మందికి విమానాశ్రయాల్లో థర్మల్ స్క్రీనింగ్ నిర్వహించామన్నారు. తొలుత నాలుగు అంతర్జాతీయ విమానాశ్రయాల్లోనే ఈ పరీక్షలు అందుబాటులో ఉంచామని.. ప్రస్తుతం ఈ పరీక్షలు మొత్తం 21 విమానాశ్రయాల్లో నిర్వహిస్తున్నామని చెప్పారు.

More Telugu News