కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి ‘బేబీ మఫ్లర్ మ్యాన్’.. ప్రత్యేకంగా ఆహ్వానించిన ఆప్

13-02-2020 Thu 17:31
  • కేజ్రీవాల్ వేషధారణలో ఆకట్టుకున్న అవ్యాన్ తోమర్
  • దేశవ్యాప్తంగా నెటిజన్ల ఆసక్తి
app Invites baby mufflerman for kejriwal oath ceremony

ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్ కౌంటింగ్ రోజున అచ్చం అరవింద్ కేజ్రీవాల్ స్టయిల్ లో రెడీ అయి అందరినీ ఆకట్టుకున్న ‘బేబీ మఫ్లర్ మ్యాన్’కు ఆప్ నుంచి ప్రత్యేకంగా ఆహ్వానం అందింది. 16వ తేదీన జరిగే కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ‘బేబీ మఫ్లర్ మ్యాన్’ను ఆహ్వానించినట్టుగా ఆప్ ట్విట్టర్ లో ట్వీట్ చేసింది.

ఎవరీ ‘బేబీ మఫ్లర్ మ్యాన్’?
ఏడాది వయసున్న ఆ బాలుడి పేరు అవ్యాన్ తోమర్, ఓ ఆప్ కార్యకర్త కుమారుడు. ఢిల్లీ ఎలక్షన్ కౌంటింగ్ రోజున ఆప్ హెడ్డాఫీసు దగ్గర అందరినీ ఆకట్టుకున్నాడు. అచ్చం అరవింద్ కేజ్రీవాల్ కట్టుకునేట్టుగా తలకు మఫ్లర్ చుట్టుకుని, మెరూన్ కలర్ స్వెటర్ వేసుకుని, అచ్చం కేజ్రీవాల్ ధరించేటటువంటి కళ్లద్దాలు పెట్టుకుని, ఆప్ టోపీ, చిన్న మీసంతో అలరించాడు. ఆ రోజున అవ్యాస్ తోమర్  ఫొటోలు వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొట్టాయి. ఆ రోజే ‘బేబీ మఫ్లర్ మ్యాన్’ అని పేరు పెట్టారు. తాజాగా అతడిని ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు. చిత్రమైన విషయం ఏమిటంటే.. కేజ్రీవాల్ ఆహార్యానికి ఓ సింబల్ గా మారిన మఫ్లర్ ను ఆయన కొంతకాలంగా ధరించడం లేదు.