యూపీలో మంత్రులకు యాపిల్ ఐప్యాడ్లు.. వాటితోనే కేబినెట్ మీటింగ్

13-02-2020 Thu 15:49
  • పేపర్ లెస్ విధానం కోసమేనన్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్
  • ల్యాప్ టాప్ లు, ట్యాబ్లెట్లు వాడాలని ఎమ్మెల్యేలకు సూచన
  • ప్రభుత్వ పథకాల పర్యవేక్షణకు ‘దర్పణ్’ డ్యాష్ బోర్డు వాడుతున్న యోగి

ఉత్తరప్రదేశ్ లో మంత్రులకు యాపిల్ ఐప్యాడ్లు ఇవ్వాలని ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ నిర్ణయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులంతా టెక్నాలజీ వాడకాన్ని పెంచుకోవాలని, అందుకోసం ల్యాప్ టాప్ లు, ట్యాబ్లెట్లు వినియోగించాలని సూచించారు.

పేపర్ లెస్ గా మారాలి

పాలన వేగంగా కొనసాగడానికి పేపర్ లెస్ గా మారాలని, అది కేబినెట్ నుంచే మొదలుకావాలని యోగి ఆదిత్యనాథ్ అన్నారు. వచ్చే కేబినెట్ మీటింగ్ ఐప్యాడ్లతోనే జరగాలన్నారు. మంత్రులకు పంపే సమాచారం, సందేశాలు, లెటర్లు వంటివన్నీ ఐప్యాడ్లకు పంపుతారని వివరించారు.

ఐప్యాడ్ల వినియోగంపై మంత్రులకు ట్రైనింగ్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఇక యూపీలో సంక్షమే పథకాలు, పలు ప్రోగ్రాంలకు సంబంధించి యోగి ‘దర్పణ్’ అనే డ్యాష్ బోర్డు ద్వారా పర్యవేక్షణ చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. దాదాపు అన్ని ముఖ్యమైన ప్రోగ్రాంల పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉంటారని వివరించారు.