Dont be donkeys: అటువంటి వారు గాడిదలు... ‘షికారా’ చూసి వ్యాఖ్యానించండి: నిర్మాత విధు చోప్రా

  • కశ్మీర్ పండితుల వలసలపై తీసిన ‘షికారా’ చిత్రం
  • వలస కష్టాలను వాణిజ్యపరంగా చేశారని ఆరోపణలు
  • తీవ్రవాదాన్ని చూపించలేదన్న ఓ కశ్మీరీ మహిళ వీడియో వైరల్
Dont be donkeys First see Then comment on Shikara says vidhu Chopra

బాలీవుడ్ నిర్మాత  విధు వినోద్ చోప్రా తీసిన ‘త్రీ ఇడియట్స్’ చిత్రం బాక్సాఫీసు వద్ద ప్రభంజనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా స్వీయ దర్శకత్వంలో చోప్రా నిర్మించిన చిత్రం ‘షికారా’ ఈ నెల 7న విడుదలైంది. 80వ దశకం చివర్లో కశ్మీర్ నుంచి వలస వెళ్లిన స్థానిక పండితుల ఇక్కట్ల నేపథ్యంలో ఈ సినిమాను తీశారు. బాక్సాఫీసు వద్ద ఈ సినిమా అనుకున్న రీతిలో వసూళ్లు రాబట్టకపోవడంతో కొంతమంది విమర్శిస్తూ ట్వీట్లు పెట్టారు. కశ్మీరీల జీవితాలను వ్యాపారాత్మక ధోరణితో చూపిన చోప్రాకు సరైన శాస్తి జరిగిందని పేర్కొన్నారు.

ట్విట్టర్ లో బాయ్ కాట్ షికారా అనే హ్యాష్ ట్యాగ్ తో సినిమాను వ్యతిరేకిస్తూ సందేశాలు పెడుతున్నారు. ‘నువ్వు తీవ్రవాదాన్ని చూపించలేదు. ఇస్లాం తీవ్రవాదానికి మా కుటుంబాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఒక కశ్మీరీ పండిత్ గా నేను నీ సినిమాను గుర్తించడంలేదు’ అని ఓ కశ్మీరీ మహిళ చోప్రాపై ఆగ్రహం చేస్తూ.. తీసిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

ఈ విమర్శలపై చోప్రా ప్రతి విమర్శలు చేస్తూ.. అనాలోచితంగా విమర్శలు చేస్తున్న వారు గాడిదలన్నారు. ‘నేను నిర్మించిన త్రీ ఇడియట్స్ తొలి రోజు రూ.33 కోట్లు వసూలు చేయగా, షికారా తొలి రోజు రూ.30 లక్షలు రాబట్టింది. ఈ సినిమా తీయడానికి మాకు 11 ఏళ్లు పట్టింది. రూ.33 కోట్లు రాబట్టిన సినిమా చేశాను. నా తల్లి ఙ్ఞాపకార్థం తీసిన ఈ సినిమా తొలిరోజు రూ.30 లక్షలు రాబట్టింది. అయినా కశ్మీర్ పండితుల బాధను నేను వాణిజ్యపరంగా చేశానని మాట్లాడుతున్నారు. అటువంటివారు గాడిదలని నేను అనుకుంటున్నాను..గాడిదలు కాకండి, ముందుగా సినిమా చూసి ఆ తర్వాత ఓ అభిప్రాయానికి రండి’ అని వ్యాఖ్యానించారు.

More Telugu News