తనను 'చోటూ' అన్న అమ్మాయికి రతన్ టాటా హుందాగా సమాధానం .. నెటిజన్ల హృదయాలను గెలుచుకున్న స్పందన

13-02-2020 Thu 14:16
  • నేలపై కూర్చున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన రతన్ టాటా 
  • ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య పది లక్షలను దాటేసిందన్న బిజినెస్‌మెన్
  • 'శుభాకాంక్షలు చోటూ' అంటూ ఓ యువతి ట్వీట్
  • మనందరిలో చిన్నపిల్లాడు ఉండడం సహజమేనన్న రతన్ టాటా
Ratan Tatas response to being called Chhotu is winning the internet

రతన్‌ టాటా... ఎన్ని తెలివితేటలు ఉంటే అంతటి గొప్ప పారిశ్రామిక వేత్త అవుతారు? అటువంటి వ్యక్తినే కించపర్చేలా ఓ అమ్మాయి ఆయనను 'చోటూ' అని పిలిచింది. దీనికి రతన్ టాటా చాలా కూల్‌గా ఇచ్చిన సమాధానం నెటిజన్ల హృదయాలను గెలుచుకుంది.

తాను నేలపై కూర్చున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేస్తూ రతన్ టాటా పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఫాలోవర్ల సంఖ్య పది లక్షలను దాటేసిందని తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌ ఓపెన్‌ చేసిన సమయంలో ఇంత మంది ఫాలోవర్లు వస్తారని నేను అనుకోలేదని అన్నారు. వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నానని పేర్కొన్నారు. ఈ ఇన్‌స్టాగ్రామ్‌లో తనను అనుసరిస్తోన్న వారి నుంచి తాను చాలా నేర్చుకున్నానని చెప్పారు. తనకు చాలా సంతోషంగా ఉందని తెలిపారు.

తన ఫాలోవర్ల సంఖ్య మిలియన్ దాటిన సందర్భంగా రతన్ టాటా చేసిన ఈ వ్యాఖ్యల పట్ల ఆయన ఫాలోవర్లు ప్రశంసల జల్లు కురిపిస్తూ రిప్లై ఇచ్చారు. అయితే, ఓ అమ్మాయి మాత్రం విచిత్రమైన కామెంట్ చేసింది. 'శుభాకాంక్షలు చోటూ' అని పేర్కొంది.

దీంతో నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. ఆమెను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని గుర్తించిన రతన్‌ టాటా ఇందులో జోక్యం చేసుకుని 'సహజంగానే మనలో ప్రతి ఒక్కరిలో ఓ చిన్న పిల్లాడు ఉంటాడు. ఆ యంగ్ లేడీ పట్ల మర్యాదగానే ఉండండి' అని సమాధానం ఇచ్చారు.

దీంతో 'చోటూ' అంటూ కామెంట్ చేసిన ఆ అమ్మాయి తన కామెంట్ ను డిలేట్ చేసింది. ఈ విషయాన్ని కూడా గుర్తించిన రతన్ టాటా మళ్లీ స్పందించారు. ఓ అమాయక యంగ్ లేడీ హృదయపూర్వకంగా ఓ కామెంట్ చేసిందని, తనను 'చిన్నపిల్లాడు' అని పేర్కొందని ఆయన తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీస్‌లో పేర్కొన్నారు.

'నన్ను చోటూ అన్నందుకు కొందరు ఆమెను అవమానించారు. దీంతో ఆమె తన కామెంట్‌ను డిలేట్ చేసింది. ఆమె అభిప్రాయాలను నేను గౌరవిస్తాను. ఆమె ఇటువంటి అభిప్రాయాన్ని మరోసారి వ్యక్తం చేయకుండా ఉండాలని నిర్ణయం తీసుకోకూడదని నేను ఆశిస్తున్నాను' అని పేర్కొన్నారు.