wuhan: వూహాన్‌లో ఆ ఇద్దరూ క్షేమం...భారత్ కు రప్పించే ఏర్పాట్లు : ఏపీఎస్ఆర్టీఎస్ అధ్యక్షుడు మేడపాటి

  • వృత్యంతర శిక్షణ కోసం చైనా వెళ్లిన కర్నూల్ యువతి, రాజాం యువకుడు 
  • కరోనా కల్లోలంతో అక్కడే చిక్కుకుని విలవిల 
  • భారత ప్రభుత్వ చర్యలతో తీపి కబురు
jyothi and saikrishna are safe in wuhan city

చైనాలోని వూహాన్ నగరంలో చిక్కుకున్న కర్నూలు యువతి అన్నెం జ్యోతి, శ్రీకాకుళం జిల్లా రాజాంకు చెందిన దొంతంశెట్టి సాయికృష్ణల కుటుంబాలకు తీపి కబురు అందింది. వీరిద్దరూ క్షేమంగా ఉన్నారని, త్వరలోనే వీరిని భారత్ కు రప్పించే ఏర్పాట్లు జరుగుతున్నాయని ఏపీఎన్‌ఆర్‌టీఎస్‌ అధ్యక్షుడు వెంకట్ మేడపాటి తెలిపారు. పీఓటీపీఎల్ సంస్థకు చెందిన వీరిద్దరూ మరో 56 మంది సహచరులతో కలిసి తాము పనిచేస్తున్న సంస్థ అందించే వృత్యంతర శిక్షణ కోసం చైనాలోని వూహాన్ నగరానికి వెళ్లారు.

వీరు శిక్షణలో ఉండగానే ఆ ప్రాంతంలో కరోనా వైరస్ బయటపడడం, అది ప్రపంచ వ్యాప్తంగా కల్లోలానికి కారణం కావడం తెలిసిందే. దీంతో వూహాన్ నగరంలో చిక్కుకున్న భారతీయులను రప్పించేందుకు భారత ప్రభుత్వం రెండు ప్రత్యేక ఎయిరిండియా విమానాలను పంపించింది. కాకపోతే ఆ సమయానికి వీరికి జ్వరం ఉండడంతో దేశం విడిచి వెళ్లేందుకు అక్కడి అధికారులు అంగీకరించలేదు.

మిగిలిన వారంతా భారత్ చేరుకున్నా వీరిద్దరూ అక్కడ చిక్కుకోవడంతో కుటుంబ సభ్యుల్లో తీవ్ర ఆందోళన మొదలయ్యింది. జ్యోతికి ఈనెల 14వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు విషయాన్ని రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా, వారు భారత ప్రభుత్వంతో సంప్రదించారు. 

ఈ నేపథ్యంలో వెంకట్ మాట్లాడుతూ 'జ్యోతి సమస్యపై చైనాలోని భారత రాయబార కార్యాలయంతోపాటు చైనా రాయబార కార్యాలయం అధికారులతోను మాట్లాడాం. ఆమె పరిస్థితి వివరించాం. జ్యోతి క్షేమంగా ఉందని, ఆమెకు కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అక్కడి భారత రాయబార కార్యాలయం రెండో కార్యదర్శి జె.స్నేహజ సమాచారం కూడా ఇచ్చారు. వీలైనంత వేగంగా జ్యోతిని స్వదేశానికి పంపే ఏర్పాట్లు చేస్తున్నామని భారత రాయబార కార్యాలయం అధికారులు నాకు మెయిల్ కూడా పంపారు' అంటూ వెంకట్ మేడపాటి నిన్న ఓ ప్రకటన విడుదల చేశారు.

మరోవైపు తాను క్షేమంగా ఉన్నానని, తన గురించి దిగులు చెందవద్దని సాయికృష్ణ నుంచి తల్లిదండ్రులకు సమాచారం అందడంతో వారు కూడా ఊపిరి పీల్చుకున్నారు.

More Telugu News