Jagan: ఉగాది రోజున ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీకి మోదీని ఆహ్వానించిన జగన్!

  • ఢిల్లీలో మోదీతో ముగిసిన జగన్ భేటీ
  • సుమారు గంటన్నరపాటు సమావేశం
  • ఏపీకి సంబంధించిన పలు అంశాలపై మోదీకి విజ్ఞప్తి చేసిన జగన్
Cm Jagan Invites Pm Modi to AP

ఢిల్లీలో ప్రధాని మోదీ, ఏపీ సీఎం జగన్ ల భేటీ ముగిసింది. సుమారు గంటన్నరపాటు కొనసాగిన ఈ భేటీలో పలు అంశాలు చర్చకు వచ్చినట్టు సమాచారం. కేంద్రానికి ఇటీవల రాసిన లేఖలోని అంశాల గురించి జగన్ ప్రస్తావించారని తెలుస్తోంది. మార్చి 25 న ఉగాది పర్వదినం రోజున ఏపీలో 25 లక్షల కుటుంబాలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయనున్న విషయాన్ని చెప్పారని, ఈ కార్యక్రమానికి హాజరు కావాలని మోదీని జగన్ ఆహ్వానించారని తెలుస్తోంది.  

పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలు రూ.55, 549 కోట్లకు పరిపాలనా పరమైన అనుమతులకు ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని, ప్రాజెక్టు కోెసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన రూ.3320 కోట్లు విడుదల చేసేలా జలవనరుల శాఖను ఆదేశించాలని మోదీకి జగన్ విజ్ఞప్తి చేసినట్టు సమాచారం.

ఏపీకి ప్రత్యేక హోదా, హైకోర్టును కర్నూలుకు తరలించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని, కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణం, రాజధాని నిర్మాణానికి మిగిలిన నిధులు, రామాయపట్నం పోర్టు నిర్మాణానికి, కృష్ణా-గోదావరి నదుల అనుసంధానికి నిధులు, పెండింగ్ లో ఉన్న గ్రాంట్స్ విడుదల చేయాలని, ఆంధ్రప్రదేశ్ దిశ చట్టం-2019కు ఆమోదం తెలపాలని, శాసన మండలి రద్దుపై చర్యలు తీసుకోవాలని మోదీకి జగన్ విజ్ఞప్తి చేసినట్లు సమాచారం.

More Telugu News