Under-19 Worldcup: ఆటలో దూకుడుని స్వాగతిస్తా.. అది మితిమీరకూడదు: కపిల్ దేవ్

  • పోటీ పేరుతో మర్యాద తప్పి ప్రవర్తించకూడదు
  • యువ క్రికెటర్ల అభ్యంతరకర ప్రవర్తన ఆక్షేపణీయం
  • క్రికెట్ ఆట అంటే ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లను కవ్వించడం కాదు
BCCI to take strict action against In disciplined India under nineteen cricketers says Kapil Dev

క్రికెట్లో దూకుడు ఉండాలి కాని మితిమీరకూడదు అని భారత క్రికెట్ దిగ్గజం మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ వ్యాఖ్యానించారు. ఇదే రీతిలో మాజీ క్రికెటర్లు అజహరుద్దీన్, బిషన్ సింగ్ బేడీ కూడా వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా భారత్, బంగ్లాదేశ్ ఆటగాళ్ల మధ్య చోటుచేసుకున్న ఘర్షణపై భారత క్రికెట్ దిగ్గజం మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అసంతృప్తి వ్యక్తం చేశారు.

‘ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లతో దురుసుగా ప్రవర్తించిన భారత ఆటగాళ్లపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకోవాలి. క్రికెట్ అంటే ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను కవ్వించడం కాదు. ఆటలో దూకుడును స్వాగతిస్తా, అయితే అది మితిమీరకూడదు. ఫైనల్లో అది మితిమీరింది. పోటీ పేరుతో మర్యాద తప్పి ప్రవర్తించకూడదు. మైదానంలో యువ క్రికెటర్ల అభ్యంతరకర ప్రవర్తనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించకూడదు’ అన్నారు.
మైదానంలో ఎలా ఉండాలో సహాయక సిబ్బంది చెప్పాలి: అజహరుద్దీన్


‘సాటి ఆటగాళ్లతో అమర్యాదగా ప్రవర్తించిన అండర్ 19 క్రికెటర్లపై కఠిన చర్యలు చేపట్టాలి. వారికి మైదానంలో ఎలా మసలుకోవాలన్నదానిపై సహాయక సిబ్బంది మాధ్యమంగా చెప్పించాలి. ఆ సిబ్బంది ఇదంతా జరిగే వరకు ఏం చేసినట్లు? ఆటగాళ్లు క్రమ శిక్షణతో మెలగాలి’ అని అజహరుద్దీన్ అన్నారు.

ఫైనల్లో ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు క్షమించరానిది: బిషన్ సింగ్ బేడీ

‘మీరు బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో ఘోరంగా విఫలమైనప్పటికీ.. ప్రవర్తనలో మార్పు రాకూడదు. అండర్ 19 ప్రపంచకప్ ఫైనల్లో ఆటగాళ్ల ప్రవర్తన తీరు ఘోరంగా ఉంది. వారిపై చర్యలు చేపట్టాలి. ఆ వయసులో సాధారణంగా కనిపించే అమాయకత్వం వారిలో లోపించింది. ఈ విషయంలో బంగ్లా ఆటగాళ్లు ప్రవర్తించిన తీరు మనకు సంబంధించింది కాదు. అది వారి సమస్య. మన ఆటగాళ్లు చేసిందే మనకు సమస్య. ఆటగాళ్లు దుర్భాషలాడిన విషయాన్ని మనం వీడియో రికార్డింగ్ లో చూడవచ్చు’ అని బేడీ స్పందించారు.

More Telugu News