Pawan Kalyan: సుగాలీ ప్రీతి ఘటనపై ప్రభుత్వ పెద్దలు ఇంత వరకూ న్యాయం చేయలేదు: పవన్ కల్యాణ్

  • కర్నూలులో జనసేన పార్టీ ఈరోజు ర్యాలీ
  • దిశ సంఘటనకు ముందే సుగాలీ ప్రీతి ఘటన జరిగింది
  • ప్రీతి తల్లి రోదన నన్ను నిస్సహాయతకు గురిచేసింది
Jana sena pawan kalyan Fires on AP Government

విద్యార్థిని సుగాలీ ప్రీతి అత్యాచారం కేసులో నిందితులను శిక్షించాలని కోరుతూ కర్నూలులో జనసేన పార్టీ ఈరోజు ర్యాలీ నిర్వహిస్తోంది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీకి జన సైనికులు, అభిమానులు, విద్యార్థులు, బీజేపీ నేతలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

అనంతరం, కోట్ల కూడలిలో నిర్వహించనున్న బహిరంగ సభలో పవన్ ప్రసంగిస్తూ, స్కూల్ కెళ్లి ఇంటికి రావాల్సిన బిడ్డ ఉరి వేసుకుని చనిపోవడం చాలా బాధకరమైన విషయమని అన్నారు. సుగాలీ ప్రీతి ఘటన తన దృష్టికి ఎలా వచ్చిందో ఆయన వివరించారు. మూడు నెలల క్రితం మంగళగిరిలోని తమ పార్టీ ఆఫీసుకు సుగాలీ ప్రీతి తల్లి వచ్చారని, ఈ ఘటన గురించి చెప్పి తన ఆవేదన వ్యక్తం చేశారని అన్నారు.

స్కూల్ నుంచి తిరిగి రావాల్సిన తన బిడ్డను సామూహిక అత్యాచారం చేసి చంపేశారని సుగాలీ ప్రీతి తల్లి కన్నీరుమున్నీరయ్యారని పవన్ గుర్తుచేసుకున్నారు. ఆ తల్లి రోదన, ఆ తల్లి వేదన తనను ఎంతో నిస్సహాయతకు గురిచేసిందని అన్నారు. దిశ సంఘటనకు ముందే సుగాలీ ప్రీతి అత్యాచారం, హత్య జరిగాయని, అయినా, ప్రభుత్వ పెద్దలు ఇంత వరకూ న్యాయం చేయలేదని మండిపడ్డారు. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వంలో చలనం లేకపోవడం వల్లే ఈ ర్యాలీని నిర్వహించామని చెప్పారు.

More Telugu News