బీజేపీ ఓటమికి మోదీ, నడ్డా కాదు.. ఆయనే కారణం: శివసేన

12-02-2020 Wed 15:34
  • ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఓటమికి అమిత్ షానే కారణం
  • ఎన్నికలను కీర్తిప్రతిష్టల సమస్యగా ఆయన మార్చేశారు
  • అహంకారం, తాము చెప్పిందే వినాలనే ధోరణిని ఢిల్లీ ప్రజలు ఓడించారు
He is responsible for BJP defeat says Shiv Sena

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కేవలం 8 స్థానాల్లో మాత్రమే గెలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ ఓటమిపై శివసేన స్పందించింది. బీజేపీ ఓటమికి ప్రధాని మోదీ, ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కారణం కాదని శివసేన అధికార పత్రిక సామ్నా తెలిపింది.

కేంద్ర హోంమంత్రి అమిత్ షానే బీజేపీ ఓటమికి కారణమని వ్యాఖ్యానించింది. ఢిల్లీ ఎన్నికలను కీర్తిప్రతిష్టల సమస్యగా అమిత్ షా మార్చేశారని... మోదీ ఎప్పుడూ అలా ఆలోచించలేదని తెలిపింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నడ్డా పదవీ బాధ్యతలను చేపట్టి కొన్ని రోజులు మాత్రమే అయిందని... ఈ నేపథ్యంలో అమిత్ షానే మొత్తం తతంగాన్ని నడిపించారని పేర్కొంది.

అమిత్ షా హయాంలో మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాలను కూడా బీజేపీ కోల్పోయిందని సామ్నా గుర్తు చేసింది. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించడానికి మోదీ ఛరిష్మానే కారణమని తెలిపింది. అంతులేని అహంకారం, తాము చెప్పిందే వినాలనే ధోరణిని ఢిల్లీ ప్రజలు ఓడించారని పేర్కొంది. సీఏఏ, ఎన్నార్సీ, షహీన్ బాగ్ ల చుట్టూనే బీజేపీ తిరిగిందని... కానీ ఢిల్లీ ప్రజలు కేజ్రీవాల్ పనితీరుకు పట్టం కట్టారని చెప్పింది. లోక్ సభ ఎన్నికల్లో ఢిల్లీలోని అన్ని స్థానాలను బీజేపీ గెలుచుకుందని... కానీ, అసెంబ్లీ ఎన్నికలు వచ్చే సరికి కేజ్రీవాల్ కు ప్రజలు జై కొట్టారని తెలిపింది.