కరోనా ఎఫెక్ట్.. పుట్టినరోజు చేసుకుంటానంటే జైల్లో పెట్టారు

12-02-2020 Wed 14:40
  • వైరస్ భయంతో పార్టీలపై నిషేధం విధించిన చైనా
  • అనుమతివ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్న వృద్ధుడు
  • ఒంటికి టపాసులు చుట్టుకుని, పెట్రోల్ పోసుకుని బెదిరింపు
  • అరెస్టు చేసి క్రిమినల్ కేసు పెట్టిన పోలీసులు
 china charges a man who pushed birthday party despite corona outbreak

చైనాలో కరోనా వైరస్ ఎఫెక్ట్ పెళ్లిళ్లు, ఫంక్షన్లు, పుట్టినరోజు వేడుకలపైనా పడింది. ఓ 59 ఏళ్ల
వృద్ధుడు తన పుట్టినరోజు చేసుకుంటానంటే.. అధికారులు ఒప్పుకోలేదు. దాంతో టపాసులు ఒంటికి చుట్టుకుని ఆత్మహత్య చేసుకుంటానని ఆ వృద్ధుడు బెదిరించాడు. దీనిపై మండిపడ్డ పోలీసులు ఆయనపై క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపారు. చైనాలోని చోంగ్ కింగ్ పట్టణంలో బుధవారం ఈ ఘటన జరిగింది.

అసలేం జరిగింది?

కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా చైనాలోని పలు ప్రాంతాలపై అక్కడి ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అవసరమైతే తప్ప ఎవరూ ఇండ్లలోంచి బయటికి రావొద్దని, పార్టీలు, ఫంక్షన్లు ఏమీ చేసుకోవద్దని ఆదేశించింది. అయితే చోంగ్ కింగ్ పట్టణానికి చెందిన ఓ 59 ఏళ్ల వ్యక్తి తన పుట్టినరోజు చేసుకునేందుకు ప్లాన్ చేశాడు. ఓ నలభై, యాభై మందిని పిలుచుకుంటానని, అనుమతి ఇవ్వాలని అధికారులను కోరాడు. కానీ ఆఫీసర్లు ఒప్పుకోలేదు. అప్పటికే ఆయన ఉండే అపార్ట్ మెంట్లో కొందరికి కరోనా వైరస్ సోకిందని, మిగతా వారికీ అంటుకుంటుందని నచ్చజెప్పారు. కానీ ఆ వ్యక్తి వినలేదు.

టపాసులు చుట్టుకుని, పెట్రోల్ తో..

తన పుట్టినరోజుకు అనుమతి ఇవ్వాలని, లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని ఆ వ్యక్తి ఆఫీసర్లను బెదిరించాడు. ఒంటికి టపాసులు చుట్టుకుని, పెట్రోల్ పోసుకుని ఆఫీసర్ల దగ్గరికి వెళ్లాడు. చేతిలో లైటర్ ఆన్ చేసి అంటించుకుంటానని బెదిరించాడు. దీంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. క్రిమినల్ కేసు పెట్టి జైలుకు పంపారు.