ఇండియా పర్యటనపై ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు

12-02-2020 Wed 10:39
  • మోదీ గొప్ప జెంటిల్మన్
  • అమెరికాతో కలిసి ఎంతో చేయాలని భారత్ భావిస్తోంది
  • భారత్ పర్యటన కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా
Seven million people from airport to stadium says Trump

భారత పర్యటన కోసం తాను ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తన పర్యటనలో భాగంగా ఇరు దేశాల మధ్య కీలకమైన ఒప్పందాలు జరగబోతున్నాయనే సంకేతాన్ని ఆయన ఇచ్చారు. ఫిబ్రవరి 24, 25 తేదీల్లో ట్రంప్ భారత్ లో పర్యటించబోతున్న సంగతి తెలిసిందే. ఢిల్లీలో మాత్రమే పర్యటన కొనసాగాలని తొలుత భావించినప్పటికీ... గుజరాత్ లోని అహ్మదాబాద్ లో కూడా పర్యటించాలని ట్రంప్ నిర్ణయించారు.

ఈ సందర్భంగా వైట్ హౌస్ లో మీడియా ప్రతినిధులతో ట్రంప్ మాట్లాడుతూ, ప్రధాని మోదీ గొప్ప జంటిల్మన్ అని కితాబిచ్చారు. అమెరికాతో కలసి ఎంతో చేయాలని భారత్ భావిస్తోందని... అవసరమైన అన్ని ఒప్పందాలు చేసుకోవడానికి తాము సిద్ధంగా ఉన్నామని... భారత్ తో కలిసి ముందుకు సాగుతామని చెప్పారు.

గత ఏడాది అమెరికాలో మోదీ పర్యటించినప్పుడు హ్యూస్టన్ స్టేడియంలో భారీ సభను నిర్వహించిన సంగతి తెలిసిందే. దాదాపు 50 వేల మంది ఇండో-అమెరికన్లు వచ్చిన ఆ సభకు ట్రంప్ కూడా హాజరయ్యారు. దీనిపై ట్రంప్ సరదా వ్యాఖ్యలు చేశారు. 50 వేల మంది మాత్రమే రావడం తనకు తృప్తిని కలిగించలేదని... అందుకే, అహ్మదాబాద్ లో ఎయిర్ పోర్ట్ నుంచి స్టేడియం వరకు తనకు, మోదీకి కనీసం 50 లక్షల నుంచి 70 లక్షల మంది స్వాగతం పలుకుతారని చెప్పారు. 'మీకు తెలుసు... ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం అహ్మదాబాద్ స్టేడియం. మోదీ దాన్ని నిర్మిస్తున్నారు. దాని నిర్మాణం ఇప్పటికే దాదాపుగా పూర్తైంది. ప్రపంచంలోనే అతి పెద్ద స్టేడియం అది' అని వ్యాఖ్యానించారు.

నిన్ననే మోదీతో తాను మాట్లాడానని... తన ఇండియా పర్యటనపై ఇరువురం చర్చించుకున్నామని ట్రంప్ తెలిపారు. అహ్మదాబాద్ లో తనకు స్వాగతం పలికేందుకు వేలాది మంది ఆత్రుతగా ఉన్నారని మోదీ తనతో చెప్పారని అన్నారు.

మరోవైపు, అహ్మదాబాద్ లోని మొతేరా స్టేడియంను 100 బిలియన్ అమెరికన్ డాలర్లతో నిర్మిస్తున్నారు. ఈ స్టేడియంలో లక్ష మంది ప్రేక్షకులు కూర్చునే అవకాశం ఉంది. ఆస్ట్రేలియాలోని బెల్బోర్న్ క్రికెట్ స్టేడియం కంటే ఈ మొతేరా క్రికెట్ స్టేడియం పెద్దది కావడం గమనార్హం.