cyber crime: మహిళా కానిస్టేబుల్‌కు వందకుపైగా అశ్లీల వీడియోలు.. కటకటాల వెనక్కి పంపిన పోలీసులు

Man arrested for sending porn videos to woman constble
  • నిందితుడిది లింగాలఘనపురం
  • అమ్మాయిల నంబర్లు సేకరించి వాట్సాప్‌లో అశ్లీల వీడియోలు
  • అర్ధరాత్రి వేళ ఫోన్లు చేసి వేధింపులు
మహిళా కానిస్టేబుల్‌కు వాట్సాప్‌లో వందకుపైగా అశ్లీల వీడియోలు పంపిన వ్యక్తిని పోలీసులు కటకటాల వెనక్కి పంపారు. హైదరాబాద్‌లో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. జనగామ జిల్లా లింగాలఘనపురం గ్రామానికి చెందిన కందగళ్ల భాస్కర్ విద్యార్థినులు, యువతులు, మహిళల నంబర్లు సంపాదించి వాట్సాప్ ద్వారా వారికి అశ్లీల వీడియోలు పంపేవాడు.

ఈ క్రమంలో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న ఓ మహిళా కానిస్టేబుల్‌కు ఐదు నెలల క్రితం వాట్సాప్ ద్వారా అశ్లీల వీడియోలు పంపించాడు. అక్కడితో ఆగక, అర్ధరాత్రి వేళ ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడేవాడు. దీంతో ఆమె సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే, వీడియోలు పంపించిన అనంతరం భాస్కర్ తన సిమ్‌ను తీసి పడేయడంతో దర్యాప్తు ముందుకు సాగలేదు. తాజాగా, బషీర్‌బాగ్‌లో భాస్కర్ పోలీసులకు చిక్కాడు.

ఓ యువతిని వేధించిన కేసులో 2017లో భాస్కర్ రెండేళ్లు జైలు శిక్ష కూడా అనుభవించినట్టు పోలీసులు తెలిపారు. చదువును మధ్యలో ఆపేసి జీవనోపాధి కోసం హైదరాబాద్ వచ్చి కాంట్రాక్ట్ ఉద్యోగిగా చేరాడు. ఈ క్రమంలో యువతులు, మహిళల ఫోన్ నంబర్లు సేకరించి వారికి అశ్లీల వీడియోలు పంపుతూ వేధించేవాడు. తాజా దర్యాప్తులో నిందితుడు తన నేరాన్ని అంగీకరించినట్టు పోలీసులు తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకు భాస్కర్‌ను జైలుకు తరలించారు.
cyber crime
videos
woman constable
Hyderabad
Crime News

More Telugu News