కేజ్రీవాల్ ఎందుకు గెలిచారంటే?.. కారణం చెప్పిన జమ్మూకశ్మీర్ బీజేపీ చీఫ్

12-02-2020 Wed 06:47
  • హనుమాన్ చాలీసా పఠించడం వల్లే కేజ్రీవాల్ గెలిచారు
  • హనుమంతుడు ఆయనను దీవించాడు
  • లోక్‌సభ ఎన్నికల్లో రాముడు మమ్మల్ని దీవించాడు
BJP J and K chief reveals the reason behind the AAP victory

ఢిల్లీ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. వరుసగా మూడోసారి ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకున్న కేజ్రీవాల్ ఈ నెల 14న ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇంతటి ఘన విజయాన్ని అందుకోవడానికి గల కారణం వేరే ఉందని జమ్మూకశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా అన్నారు.

హనుమాన్ చాలీసా పఠించడం వల్లే కేజ్రీవాల్ ఇంతటి ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారని రైనా పేర్కొన్నారు. చాలీసా పఠించడం వల్ల హనుమంతుడు ఆయనను ఆశీర్వదించాడని అన్నారు. అయితే, మరి ‘జై శ్రీరాం’ అని బీజేపీ కార్యకర్తలు జపిస్తున్నా రాముడు వారినెందుకు దీవించలేదన్న ప్రశ్నకు రైనా ప్రతిస్పందిస్తూ.. వారంతా లోక్‌సభ ఎన్నికల్లో ‘జై శ్రీరాం’ అనడం వల్లే ఆ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినట్టు చెప్పుకొచ్చారు.