Chicken: కరోనా ప్రభావం: వారం పాటు చికెన్, మటన్ అమ్మకాలపై నిషేధం

  • కోళ్లు చనిపోతుండటంతో వారంపాటు నాన్ వెజ్ హాలిడే
  • ప.గోదావరి జిల్లా తణుకు ప్రాంతంలో వర్తింపు
  • కోళ్ల మృతికి, కరోనా వైరస్ కు సంబంధం లేదన్న అధికారులు
Chicken Mutton sales ban at West Godavari

ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా వైరస్ కోళ్లలో ప్రవేశించిందని పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ప్రాంతంలో పుకార్లు రావడాన్ని అధికారులు ఖండించారు. కోళ్లకు కరోనా వైరస్ సోకుతుందని ఇంతవరకు నిరూపితం కాలేదన్నారు. తణుకు నియోజకవర్గంలో అంతుచిక్కని వైరస్ సోకి కోళ్లు చనిపోతుండటంతో ఈ పుకార్లు వచ్చాయి. భారీ సంఖ్యలో కోళ్లు మృత్యువాత పడుతుండడంతో అధికారులు రంగంలోకి దిగారు. ఈ క్రమంలోనే తణుకుతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో  చికెన్ తోపాటు  మటన్ అమ్మకాలపై వారం రోజుల పాటు నిషేధం విధించారు.

ఇదిలావుండగా, తణుకులో పరిస్థితిని ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు సమీక్షించారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా రేపటి నుంచి వారం రోజుల పాటు మటన్, చికెన్ అమ్మకాలను నిలిపివేస్తున్నట్లు ఆయన మీడియాకు వెల్లడించారు. ‘వారం రోజులు నాన్‌ వెజ్‌ హాలీడేగా ప్రకటిస్తున్నాం’ అని చెప్పారు.
 
వైరస్ బారినపడి చనిపోయిన కోళ్లను కాలువలు, రోడ్ల పక్కన పడేయకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఈ నేపథ్యంలో పురపాలక‌, నీటిపారుదల శాఖల సిబ్బందిని అప్రమత్తం చేశామని చెప్పారు. కోళ్లకు వస్తున్న వైరస్‌తో స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయంటూ.. కోళ్లకు వచ్చే వైరస్‌కు, కరోనా వైరస్‌కు సంబంధం లేదని అధికారులు తేల్చి చెప్పారన్నారు. ప్రజలు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే చెప్పారు.

More Telugu News