AAP: 'ఆప్' వైపు మొగ్గిన ఓటర్లు 54 శాతం కాగా.. బీజేపీకి 39 శాతం

  • 62 స్థానాల్లో గెలుపు ఖాయంచేసుకున్న ఆప్
  • కాంగ్రెస్ కు ఓటు వేసిన వారి శాతం 4.36 మాత్రమే
  • నోటా కింద 0.47 శాతం
 Voting Share in Delhi Assembly Elections

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభంజనం సృష్టించింది. మొత్తం 70 స్థానాలకు గాను ఆప్ ఇప్పటివరకు 62 స్థానాలను కైవసం చేసుకుని, మరో స్థానంలో ఆధిక్యంలో వుంది. అటు ఓటింగ్ శాతంలో కూడా ఆప్ దాదాపుగా 54 శాతం ఓటర్లను తవవైపుకు తిప్పుకుంది. కాగా బీజేపీ ఇప్పటికి 7 స్థానాల్లో విజయం సాధించింది. మరో ప్రధాన జాతీయ పార్టీ కాంగ్రెస్ ఈ సారీ కూడా ఒక్క స్థానంలోనూ గెలువలేకపోతోంది. మరోవైపు ఆప్ ప్రధాన ప్రత్యర్థి బీజేపీ ఆధిక్యంలో ఉన్న స్థానాలు క్రమేపీ తగ్గుతున్నాయి.

2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 67 స్థానాలు గెలవగా, బీజేపీ 3 స్థానాలను గెలుచుకుంది. ఇప్పుడు పార్టీల వారీగా ఓటింగ్ శాతాన్ని పరిశీలిస్తే... ఆమ్ ఆద్మీ పార్టీ 53.51 శాతం ఓట్లను పొందగా, బీజేపీ 38.69శాతం ఓట్లను పొందింది.  గత లోక్ సభ ఎన్నికల్లో  56.58 శాతం ఓట్లు పొంది అన్ని లోక్ సభ స్థానాలను గెలుచుకున్న బీజేపీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 39 శాతం ఓట్లకే పరిమితమైంది.  కాగా లోక్ సభ ఎన్నికల్లో ఆప్ కేవలం 18 శాతం ఓట్లతో ఒక్క స్థానాన్ని కూడా గెలవలేకపోయినప్పటికీ.. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో పుంజుకుని తన ప్రభంజనాన్ని చాటింది.

2015 అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోని కాంగ్రెస్ ఈ సారీ తన పరిస్థితిని మెరుగుపర్చుకోలేకపోయింది. ఈసారి కేవలం 4.36 శాతం ఓట్లను మాత్రమే పొందింది. కాగా, జేడీ(యు) 0.77 శాతం, ఎల్ జేపీ 0.39శాతం,  బీఎస్పీ 0.68 శాతం,ఎన్సీపీ 0.02 శాతం,  సీపీఐ 0.02 శాతం, సీపీఎం 0.01 శాతం పొందాయి. నోటా కింద 0.47 శాతం ఓట్లు పోలయ్యాయి.

More Telugu News