రాజస్థాన్ అసెంబ్లీలో ‘దీపికా పదుకొనె’ లొల్లి.. ఛపాక్ సినిమాకు రాయితీపై బీజేపీ ఫైర్

11-02-2020 Tue 16:04
  • వివరాలు తర్వాత చెబుతామన్న ఆ రాష్ట్ర మంత్రి
  • సినిమా అంశంపై ప్రశ్నలకు నో చెప్పిన స్పీకర్
  • ఆగ్రహం వ్యక్తం చేస్తూ వాకౌట్ చేసిన బీజేపీ ఎమ్మెల్యేలు
Rajasthan Opposition Boycotts Question Hour Over Deepika Padukone Chhapaak Movie

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనె నటించిన చపాక్ సినిమాకు పన్ను రాయితీ అంశం మంగళవారం రాజస్థాన్ అసెంబ్లీలో వివాదం రేపింది. ఆ సినిమాకు పన్ను రాయితీ ఇవ్వడం వల్ల ఖజానాకు ఎంత నష్టం వచ్చిందో చెప్పాలంటూ బీజేపీ ఎమ్మెల్యే అసెంబ్లీ ప్రశ్నోత్తరాల సమయంలో కోరారు. అయితే పన్నులకు సంబంధించి రికార్డులు, వివరాలు ఈ నెల 20 తర్వాత అందుబాటులోకి వస్తాయని.. అప్పుడు పూర్తి వివరాలు చెబుతామని ఆ రాష్ట్ర మంత్రి శాంతి ధరివాల్ సమాధానం ఇచ్చారు.

మంత్రి సమాధానంపై సంతృప్తి చెందని బీజేపీ సభ్యులు.. సినిమాకు సంబంధించి మరిన్ని ప్రశ్నలు వేశారు. కానీ స్పీకర్ సీపీ జోషి అందుకు అంగీకరించలేదు. వేరే అంశాలను ప్రస్తావించాలని సూచించారు. అయినా బీజేపీ ఎమ్మెల్యేలు వెనక్కి తగ్గకుండా.. చపాక్ సినిమా, హీరోయిన్ దీపికా పదుకొనేకు సంబంధించిన ప్రశ్నలను లేవనెత్తారు. స్పీకర్ నో చెప్పడంతో అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు.

ఢిల్లీ వర్సిటీకి దీపిక వెళ్లినప్పటి నుంచి..

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్ యూ)లో ఆందోళన చేస్తున్న స్టూడెంట్లపై కొన్ని రోజుల కిందట దాడి జరిగిన విషయం తెలిసిందే. దీపికా పదుకొనె జేఎన్ యూకు వెళ్లి ఆ ఘటనలో గాయపడ్డ వారిని పరామర్శించారు. దీనిపై వివిధ వర్గాల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ, దాని అనుబంధ సంఘాల లీడర్లు దీపిక తీరును తీవ్రంగా తప్పుపట్టారు. ఈ నేపథ్యంలోనే రాజస్థాన్ లో దీపిక సినిమా చపాక్ కు రాయితీ విషయంపై బీజేపీ ఎమ్మెల్యేలు పట్టుపట్టారని ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లీడర్లు మండిపడ్డారు.