Nara Lokesh: పెంచిన ధరలను ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి: నారా లోకేశ్

  • ఈఆర్‌సీ నూతన టారిఫ్‌పై ఆగ్రహం
  • ధరలు తగ్గిస్తానని గతంలో చెప్పిన జగన్
  • సాక్షి టీవీలో అప్పట్లో వచ్చిన వార్తను పోస్ట్ చేసిన లోకేశ్
  • తాజాగా, టీవీ 5లో వచ్చిన మరో వార్తనూ పోస్ట్ చేసిన టీడీపీ నేత
nara lokesh fires on ap govt

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ మండలి (ఈఆర్‌సీ) నూతన టారిఫ్‌ వివరాలను ప్రకటించిన నేపథ్యంలో దీనిపై స్పందిస్తూ టీడీపీ నేత నారా లోకేశ్ ట్వీట్ చేశారు. వైసీపీ ప్రభుత్వం సామాన్యుడి నడ్డి విరుస్తోందని చెప్పారు. గతంలో సాక్షి టీవీలో వచ్చిన ఓ వార్తను ఈ సందర్భంగా పోస్ట్ చేశారు.

అప్పట్లో ధరలు తగ్గిస్తానని జగన్‌ చెప్పినట్లు అందులో ఉంది. తాజాగా, విద్యుత్‌ బిల్లులపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉద్దేశిస్తూ టీవీ5లో వచ్చిన వార్తకు సంబంధించిన వీడియోను కూడా ఆయన పోస్ట్ చేశారు. 'ఏపీ ప్రభుత్వం ప్రజలకు మరో షాక్‌ ఇచ్చింది' అంటూ విద్యుత్ ఛార్జీల పెంపులను విమర్శిస్తూ అందులో వార్త ఉంది.

'తగ్గించింది నిల్లు, పెంచింది ఫుల్లు... పూర్తిగా తగ్గించేస్తాను అని హామీ ఇచ్చి ప్రజల్ని నట్టేట ముంచారు జగన్ గారు. ఆర్టీసీ చార్జీలు, పెట్రోల్ ధరలు, ఫైబర్ గ్రిడ్ కేబుల్ బిల్లు, ఇప్పుడు విద్యుత్ ధరలు పెంచుకుంటూ పోతున్నారు' అని లోకేశ్ విమర్శించారు. జగన్ 'విఫలమైన సీఎం' అని అన్నారు.

'సామాన్యుడు నడ్డి విరిచే నిర్ణయాలు తీసుకుంటూ ప్రజలపై మోయలేని భారాన్ని మోపుతోంది వైకాపా ప్రభుత్వం. పెంచిన ఆర్టీసీ ధరలు, పెట్రోల్ ధరలు, ఫైబర్ గ్రిడ్ కేబుల్ బిల్లు, విద్యుత్ ధరలను వెంటనే ఉపసంహరించుకోవాలి' అని లోకేశ్ డిమాండ్ చేశారు.

More Telugu News