శ్రుతిమించిన ఉపాధ్యాయుడికి చెప్పుతో సమాధానం చెప్పిన మహిళ

11-02-2020 Tue 11:18
  • విద్యార్ధిని తల్లితో అసభ్యంగా ప్రవర్తిస్తున్న వ్యాయామ ఉపాధ్యాయుడు
  • ఫోన్‌లో వేధిస్తుండడంతో పాఠశాలకు రాక
  • చెప్పుతో చెడామడా వాయించేసిన వైనం
mis behaviour teacher punished by the lady

ఫోన్‌లో అసభ్య పదజాలంతో మాట్లాడి వేధిస్తున్న ఓ వ్యాయామ ఉపాధ్యాయుడికి బాధిత మహిళ చెప్పుతో సమాధానం చెప్పి కంగుతినిపించింది. కుమార్తెకు శిక్షణ ఇస్తున్నాడు కదా అని కొన్నాళ్లు ఓర్చుకున్న సదరు మహిళ రానురాను ఉపాధ్యాయుడి చేష్టలు శ్రుతిమించడంతో పాఠశాలకు వచ్చి మరీ ఆగ్రహంతో ఊగిపోయింది.

పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే...గుంటూరు జిల్లా కారంపూడిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో సుబానీ అనే అతను వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అదే పాఠశాలలో చదువుతున్న ఓ బాలికకు ఇతను క్రీడల్లో శిక్షణ ఇస్తుండడంతో ఆమె తల్లి చనువుగా మాట్లాడేది.

దీన్ని ఆసరాగా తీసుకుని సదరు ఉపాధ్యాయుడు ఆమె ఫోన్‌ నంబరు సంపాదించి తరచూ ఆ మహిళకు ఫోన్‌చేసి అసభ్య పదజాలంతో మాట్లాడుతూ వేధిస్తున్నాడు. దాన్ని ఆమె తప్పుపడుతూ పాఠశాల యాజమాన్యానికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించినా అతను పట్టించుకోలేదు. దీంతో విసిగిపోయిన ఆమె నిన్న మధ్యాహ్నం భర్త, మరికొందరు బంధువులతో పాఠశాలకు వచ్చింది.

భర్త, బంధువులు సుబానీని నిలదీస్తుండగా ఆగ్రహాన్ని ఆపుకోలేకపోయిన సదరు మహిళ తన చెప్పుతీసి సదరు ఉపాధ్యాయుడిని చెడామడా వాయించేసింది. అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఎంఈఓ వీరయ్య చౌదరి మాట్లాడుతూ పాఠశాల యాజమాన్యం అతనిని విధుల నుంచి తొలగించిందని చెప్పారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులకు తాను నివేదిస్తానని చెప్పారు.