వెయ్యి దాటిన కరోనా మృతుల సంఖ్య.. మాస్క్ ధరించిన చైనా అధ్యక్షుడు

11-02-2020 Tue 10:32
  • చైనాలో అంతకంతకూ పెరుగుతున్న మృతుల సంఖ్య
  • దేశ వ్యాప్తంగా కరోనా బారిన పడిన వారి సంఖ్య 42 వేలకు పైగానే
  • బీజింగ్ లో ఆసుపత్రిని సందర్శించిన జిన్ పింగ్
Xi Jinping visites Corona camp wearing mask

చైనాలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. ఈ రక్కసి బారిన పడి మృతి చెందిన వారి సంఖ్య ఈరోజుతో వెయ్యి దాటింది. అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం చైనా దేశ వ్యాప్తంగా 1,011 మంది ప్రాణాలు కోల్పోయారు. అనధికారికంగా ఈ సంఖ్య భారీగానే ఉండొచ్చనే అనుమానాలు ఉన్నాయి. ఒక్క హూబీ ప్రావిన్స్ లోనే 103 మంది మరణించారని అధికారులు తెలిపారు. హూబీ ప్రావిన్స్ లో మరో 2,097 మంది ఈ వైరస్ బారిన పడ్డారని అక్కడి హెల్త్ కమిషన్ నిర్ధారించింది. దేశ వ్యాప్తంగా 42,200 మందికి పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడటం కలవరపరుస్తోంది.

మరోవైపు బీజింగ్ లో కరోనా సోకినవారు చికిత్స పొందుతున్న ఆసుపత్రిని చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ సందర్శించారు. వైద్య సిబ్బందిని, రోగులను ఆయన కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనాను అరికట్టడానికి మరిన్ని మెరుగైన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు చైనా అధికారిక వార్తా సంస్థ సీసీటీవీ వెల్లడించింది.

మరోవైపు, అంతర్జాతీయ వైద్య నిపుణులతో కూడిన ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ)కు చెందిన బృందం నిన్న రాత్రి చైనాకు చేరుకుంది. ఈ బృందానికి బ్రూస్ ఐల్వార్డ్ నాయకత్వం వహిస్తున్నారు. 2014-16 మధ్య కాలంలో పశ్చిమ ఆఫ్రికాను ఎబోలా వైరస్ వణికించినప్పుడు కూడా డబ్ల్యూహోఓ తరపున కార్యకలాపాలను ఆయనే పర్యవేక్షించారు.