తిరుమలలో నకి‘లీలలు’: డూప్లికేట్‌ టికెట్లు అంటగట్టడంతో ఓ కుటుంబానికి షాక్‌

11-02-2020 Tue 09:44
  • అభిషేకం, సుప్రభాతం కోసం టికెట్లు కొనుగోలు
  • సమయానికి వెళితే అవి నకిలీవని తిప్పిపంపిన సిబ్బంది
  • విజిలెన్స్‌ అధికారులకు ఫిర్యాదు చేసిన బాధితులు
duplicate tickets scame in Tirumala

తిరుమలలో మరో మోసం బయటపడింది. ఓ కుటుంబానికి 28 నకిలీ టికెట్లు అంటగట్టి రూ.73 వేలు కొట్టేశారు ఇద్దరు వ్యక్తులు. బాధితులు విజిలెన్స్‌ అధికారులను ఆశ్రయించడంతో మోసం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే...చెన్నైకి చెందిన రవినారాయణన్‌ అనే వ్యక్తి తనకు శ్రీవారి సేవల టికెట్లు కావాలని బంధువు భరత్‌ను కోరాడు. అతను లక్తిక్‌, రాహుల్‌ అనే ఇద్దరు వ్యక్తులను పరిచయం చేసి వీరు టికెట్లు ఏర్పాటు చేస్తారని తెలిపాడు.

నిజమేననుకున్న నారాయణన్‌ తన కుటుంబ సభ్యుల కోసం 18 అభిషేకం, 10 సుప్రభాతం టికెట్లు కొనుగోలుకు రూ.73 వేలు ఆన్‌లైన్‌లో వారిద్దరికీ చెల్లించాడు. దీంతో రవినారాయణన్‌కు లక్తిక్‌, రాహుల్‌ టికెట్లు పంపారు. తీరా ఆ టికెట్లు పట్టుకుని తిరుమల వెళ్లిన వారికి అవి నకిలీవని సిబ్బంది చెప్పడంతో షాక్‌ తిన్నారు.

దీంతో నిన్న తిరుమల విజిలెన్స్‌ అధికారులను కలిసి జరిగిందంతా తెలిపి ఫిర్యాదు చేశారు. అధికారులు మోసగించిన వ్యక్తులపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.