Karimnagar District: 'దిశ'ను మరువక ముందే మరో ఉన్మాదం, పైశాచికం: విజయశాంతి

  • కరీంనరగ్ లో రాధిక హత్యోదంతంపై స్పందన
  • మానవత్వం మంటగలుస్తోందన్న విజయశాంతి
  • ఫేస్ బుక్ లో పోస్ట్
Vijayashanti Fires on TRS over Girl Rape

దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన 'దిశ' ఘటనను మరువక ముందే కరీంనగర్ లో రాధిక అనే బాలికను కిరాతకంగా హతమార్చారని, ఇది ఉన్మాదమని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్ పర్సన్, నటి విజయశాంతి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆమె తన ఫేస్ బుక్ ఖాతాలో ఓ పోస్ట్ పెట్టారు.

"దిశ ఉదంతం మర్చిపోకముందే... కరీంనగర్ జిల్లాలో రాధిక అనే బాలికపై ఓ ప్రేమోన్మాది దాడి చేసి, ఆమెను కిరాతకంగా హతమార్చడం తెలంగాణ సమాజాన్ని కుదిపేసింది. ఇంట్లో ఉన్న బాలికపై కత్తితో దాడి చేసిన ఉన్మాది, విచక్షణరహితంగా హత్య చేశాడు అంటే, మానవత్వం ఏ రకంగా మంటగలుస్తున్నదో అర్థమవుతోంది. ఎన్ కౌంటర్లు చేసినా మారడం లేదు, ఉరి తీస్తున్నా భయం లేదు. ఇక ఇదే పరిస్థితి కొనసాగితే, అరబ్ దేశాల్లో మాదిరిగా మహిళల పట్ల దారుణంగా ప్రవర్తించే వ్యక్తులను బహిరంగంగా శిక్షించే విషయాన్ని పరిశీలించాలి. లేనిపక్షంలో సమాజంలో స్త్రీలు స్వేచ్ఛగా బ్రతికే రోజులు కరువయ్యే ప్రమాదం ఉంది.

 అర్ధరాత్రి ఆడది స్వేచ్ఛగా తిరిగిన రోజే దేశానికి స్వాతంత్య్రం వచ్చినట్లని మహాత్మా గాంధీ చెప్పారు కానీ... ఈరోజు కరీంనగర్ లో ఇంట్లో ఉన్న బాలికకే రక్షణ కరువయ్యింది అంటే, సమాజం ఎంత ప్రమాద పరిస్థితిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు సోషల్ మీడియా ప్రధాన కారణం అన్నది తెలంగాణ ప్రజల అభిప్రాయం.

సోషల్ మీడియా విశృంఖలత్వాన్ని కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటానని ఇటీవల జరిగిన మీడియా సమావేశంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గారు ప్రకటించారు. సీఎం గారు చేసిన ప్రకటన ఆచరణలోకి వచ్చి, సోషల్ మీడియా వికృత పోకడలను నియంత్రిస్తే, మహిళలపై జరిగే దారుణాలను అదుపు చేయవచ్చని అని తెలంగాణలోని మహిళా లోకం తేల్చి చెబుతోంది. ఈ విషయంలో సత్వరం నిర్ణయం తీసుకోవాలని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కోరుతున్నాను" అని అన్నారు.

More Telugu News