మయాంక్ 1, కోహ్లీ 9 పరుగులకు ఔట్... పేలవంగా సాగుతున్న భారత్ బ్యాటింగ్!

11-02-2020 Tue 08:30
  • నిరాశ పరిచిన ఓపెనర్లు
  • లేని రన్ కు ప్రయత్నించి పృధ్వీషా అవుట్
  • కష్టాల్లో భారత్
Team India in Trouble

భారత్, న్యూజిలాండ్ మధ్య మౌంట్ మౌన్ గనూయ్ లో జరుగుతున్న మూడవ వన్డేలో టాస్ గెలిచిన న్యూజిలాండ్, భారత జట్టును బ్యాటింగ్ కు ఆహ్వానించగా, మన ఆటగాళ్లు పేలవంగా మ్యాచ్ ని ప్రారంభించారు. ఓపెనర్ మయాంక్ అగర్వాల్ 3 బంతుల్లో కేవలం 1 పరుగు మాత్రమే చేసి జేమీసన్ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోగా, వన్ డౌన్ లో వచ్చిన కెప్టెన్ విరాట్ కోహ్లీ, 12 బంతులాడి 9 పరుగుల వద్ద బెన్నెట్ బౌలింగ్ లో జేమీసన్ కు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరి నిరాశ పరిచాడు.

ఆపై కాసేపటికే ఓపెనర్ గా వచ్చిన పృధ్వీషా, నిలదొక్కుకుంటున్న సమయంలో లేని రన్ కు ప్రయత్నించి, 40 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔట్ కావడంతో భారత్ 3 వికెట్లను కోల్పోయింది. ప్రస్తుతం భారత స్కోరు 13 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 68 పరుగులు కాగా, కేఎల్ రాహుల్ 5, శ్రేయాస్ అయ్యర్ 10 పరుగులతో ఆడుతున్నారు.