జిహాద్ లాంటి పదాలు వాడే వ్యక్తికి దేశం అర్థం తెలియదు: అసదుద్దీన్ పై బీజేపీ నేత కపిల్ మిశ్రా విసుర్లు

11-02-2020 Tue 08:23
  • ఒవైసీ కర్నూలులో చేసిన వ్యాఖ్యలపై కపిల్ మిశ్రా స్పందన
  • ఒవైసీని ఎలా సరిచేయాలో భారతీయులకు తెలుసన్న బీజేపీ నేత
  • దేశాన్ని ద్వేషించే వ్యక్తులతో ఒవైసీ గుండె నిండిందన్న కపిల్ మిశ్రా
BJP Leader Kapil Mishra fires on Asaduddin Owaisi

విశ్వాసం కోల్పోయి వీధుల్లో తిరుగుతున్న మజ్లిస్ చీఫ్, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీని ఎలా సరిచేయాలో భారతీయులకు తెలుసని బీజేపీ నేత కపిల్ మిశ్రా అన్నారు. ఒవైసీని గుండెల్లో కాల్చాల్సిన పనిలేకుండానే సరిచేయడం భారతీయులకు తెలుసన్నారు. కర్నూలులో ఆదివారం జరిగిన సభలో పాల్గొన్న ఒవైసీ మాట్లాడుతూ.. తాను ఈ దేశం వ్యక్తినని, దేశాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ విడిచిపెట్టబోనని తేల్చిచెప్పారు. తనకు సంబంధించిన పత్రాలను ఎవరికీ చూపించబోనని, బలవంతం చేస్తే తన గుండెను చూపించి కాల్చేయమని చెబుతానని అన్నారు.

ఆయన వ్యాఖ్యలపై స్పందించిన కపిల్ మిశ్రా పై వ్యాఖ్యలు చేశారు. ఒవైసీ లాంటి వ్యక్తులు ఇలా కాల్పుల గురించి మాట్లాడకూడదని, జిహాద్ లాంటి పదాలు వాడే వ్యక్తికి దేశం అర్థం తెలియదని ఎద్దేవా చేశారు. ఒవైసీ గుండె దేశాన్ని ద్వేషించే వ్యక్తులతో నిండిపోయిందని కపిల్ మిశ్రా అన్నారు.