అంత నమ్మకం మరి... గుడికి వెళ్లి వచ్చి, ప్రశాంతంగా ఇంట్లో కూర్చున్న కేజ్రీవాల్!

11-02-2020 Tue 08:17
  • కేజ్రీవాల్ ఇంట పండగ వాతావరణం
  • పిల్లలతో సహా చేరుకున్న నేతలు
  • ఫలితాల కోసం ఎదురుచూస్తున్న వైనం
AAP leaders reach Kejriwals residence

గత శనివారం నాడు ఢిల్లీకి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తమదేనని నమ్మకంగా ఉన్న కేజ్రీవాల్, ఈ ఉదయం గుడికి వెళ్లి వచ్చి, తన ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని ఎన్నికల ఫలితాల గురించి వేచి చూస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ప్రధాన నేతలంతా తమ పిల్లలు, భార్యలతో కేజ్రీవాల్ ఇంటికి చేరుకున్నారు. దీంతో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. ఫలితాలు వెల్లడికాగానే, దీపావళి పండగను మరోసారి జరుపుకునేందుకు వారంతా సిద్ధమయ్యారు.

ఇక ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా తన ఇంట్లోనే ప్రత్యేక పూజలు చేయగా, బీజేపీ నేత విజయ్ గోయల్ కన్నాట్ ప్లేస్ లో ఉన్న హనుమాన్ దేవాలయాన్ని సందర్శించారు. ఈ ఉదయం 10 గంటల కల్లా మరోసారి ఢిల్లీ పీఠాన్ని కేజ్రీవాల్ అధిరోహిస్తారా? లేదా? అన్న విషయం తేలుతుందని ఎన్నికల విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, తిరిగి అధికారంలోకి వచ్చేది ఆప్ సర్కారేనని అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించిన సంగతి తెలిసిందే.